జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గోడదూకేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలు చేస్తుంటే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్స్‌కు వ్యతిరేకంగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో పార్టీ భవిష్యత్తుతో పాటు తన వ్యక్తిగత భవిష్యత్ కూడా చూసుకోవడం ముఖ్యమని వ్యాఖ్యానించారు.
తనకు జనసేన పార్టీ షోకాజ్ నోటీసు పంపించినట్టు మీడియాలో వస్తున్న వార్తలపై రాపాక ఆదివారం క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీ నుంచి తనకు షోకాజ్ నోటీసు వచ్చినట్టు... దానిపై తాను స్పందించినట్టుగా వస్తున్న వార్తలన్నీ ఫేక్ వార్తలేనని తేల్చిచెప్పారు.
తాను జనసేనలోనే ఉన్నానని తెలిపారు. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కేడర్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని... సమస్యలపై కేడర్ స్పందించేలా బాధ్యతను అప్పగించాలని చెప్పారు. అన్ని సమస్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రమే హాజరవుతుంటే... పార్టీ బలోపేతం కాదన్నారు.
ముఖ్యమంత్రి కావాలనే బలమైన సంకల్పం పవన్ కళ్యాణ్‌లో ఉండాలనీ, అప్పుడే పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రతి దానికి అధినేతే వచ్చి ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతానికైతే భవిష్యత్తు లేని పార్టీగానే జనసేన ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.