అధ్యక్షా... ఉన్నది నేనొక్కడినే.. కాస్త జాలి చూపండి అధ్యక్షా: జనసేన ఎమ్మెల్యే

మంగళవారం, 18 జూన్ 2019 (19:19 IST)
ఏపీ శాసనసభలో జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నవ్వులు పూయించారు. ఆయన ప్రసంగానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు అధికార విపక్ష సభ్యులు పడిపడి నవ్వారు. అధ్యక్షా.. మా పార్టీ తరపున సభలో ఉన్నది నేనొక్కడినే.. కాస్త జాలి చూపండి అధ్యక్షా అంటూ ఆయన చేసిన ప్రసంగం అభ్యర్థుల ముఖాల్లో నవ్వులు పూయించింది. 
 
శాసనసభ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై వాడివేడిగా చర్చ సాగింది. ఈ చర్చలోభాగంగా స్పీకర్ సీతారాం జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాకకు కూడా సమయం కేటాయించారు. దీంత రాజోలు ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ, 'అధ్యక్షా, నాపై శ్రీకాంత్ రెడ్డి అన్నేసి బాణాలు గురిపెట్టనక్కర్లేదు. సభలో మా పార్టీకి ఉన్నది నేనొక్కడ్నే అధ్యక్షా! నావైపు ఎవరూ లేరు... కనీసం జాలి చూపించండి అధ్యక్షా!' అంటూ నవ్వులు పూయించారు. 
 
దాంతో స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ, మిమ్మల్ని రక్షించడానికి స్పీకర్ ఉన్నాడని మర్చిపోకండి అంటూ అభయహస్తం అందించారు. సీఎం జగన్ కూడా రాపాక మాట్లాడుతున్న తీరును చిరునవ్వులతో ఆస్వాదించారు.
 
అనంతరం, రాపాక తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ,  వైసీపీకి బీజేపీ మిత్రపక్షం అనడం తప్పేనని అంగీకరించారు. అయితే, ఆ పార్టీతో సఖ్యతగా ఉన్నారన్న కోణంలోనే తాను ఆ వ్యాఖ్య చేశానని, బీజేపీతో స్నేహపూర్వకంగా మెలిగి ప్రత్యేకహోదా తీసుకురావాలన్నదే తన ఉద్దేశ్యమని ఆయన వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నేటికీ నవ వధువును వెంటాడే శోభనం రాత్రి బెడ్ షీట్లు...