Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జక్కంపూడి కుటుంబ దౌర్జన్యాలను సహించం..టిడిపి

Advertiesment
జక్కంపూడి కుటుంబ దౌర్జన్యాలను సహించం..టిడిపి
, మంగళవారం, 1 అక్టోబరు 2019 (07:16 IST)
కాపు కార్పొరేషన్ ఛైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ చేస్తున్న  భూకబ్జా ప్రయత్నాలను సహించేది లేదని మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.

విశ్వేశ్వరాయపురం భూ బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు.  విశ్వేశ్వరాయపురం గ్రామంలో చెల్లుబోయిన వీరరాఘవులు, బాబూరావు కుటుంబాలకు చెందిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించేందుకు జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు చేస్తున్న యత్నాలపై బాధితులు టిడిపి అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

దీనిపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ పాలిక శ్రీను, బిసి సెల్ నాయకులు గుత్తుల సాయి శ్రీనివాసరావులతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సోమవారం నాడు విశ్వేశ్వరాయపురం గ్రామానికి వచ్చి బాధితులను పరామర్శించారు.

బాధితుల భూములను స్వయంగా పరిశీలించారు.  స్థానిక బిసి నాయకులు ఇక్కడి సమస్యలను కమిటీ ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. బాధిత కుటుంబ మహిళలు చెల్లుబోయిన విజయలక్ష్మి, శేషవాణిలను కమిటీ ప్రతినిధులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాజీ మంత్రి పితాని, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. 25 సంవత్సరాల క్రితం జక్కంపూడి రాజా తల్లి విజయలక్ష్మి స్థానిక రైతులకు విక్రయించిన భూమి ఇప్పుడు విలువ పెరగడంతో దానిని దౌర్జన్యంగా ఆక్రమించేందుకు రాజా, ఆయన మేనమామ కొమ్ముల సాయి ప్రయత్నించడం శోచనీయమని వ్యాఖ్యానించారు.

స్థానిక తహసిల్దారు, పోలీసు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ బాధితులనే వేధింపులకు గురి చేయడాన్ని వారు తప్పుబట్టారు. జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు దౌర్జన్యం చేశారని బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేస్తే వారికి రక్షణ కల్పించాల్సింది పోయి బాధితుల పైనే పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి నెలల తరబడి బెయిల్ రాకుండా వేధించడం పట్ల పితాని, నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సర్వే నెంబర్లు నమోదయ్యాయని సాకు చూపుతూ విక్రయించిన భూమిని తిరిగి దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నించడాన్ని వారు తప్పుబట్టారు. భూములు కొనుగోలు చేసిన బాధితులు నిరక్షరాస్యులని, కానీ విక్రయించిన జక్కంపూడి విజయలక్ష్మి స్వయంగా న్యాయవాది అని గుర్తు చేశారు.


ఇటీవల కోర్టు బాధితులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అయినప్పటికీ స్థానిక అధికారులు బాధితులను వేధించడాన్ని వారు తప్పుబట్టారు. అధికారులు తీరు మార్చుకోకపోతే బాధితుల పక్షాన న్యాయపోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.  బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్లు కాకి లక్ష్మణ్, చెల్లింగి సత్యనారాయణ,  దొమ్మేటి ఉమామహేశ్వరరావు,  బిసి నేతలు గుబ్బల బాబ్జీ, చెల్లుబోయిన శ్రీనివాస్,  మాలమహానాడు అధ్యక్షుడు జగడం సత్యనారాయణ, జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి గెడ్డం సింహా, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బత్తుల లక్ష్మణరావు,

జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ, ఆత్మ మాజీ ఛైర్మన్ అడబాల సాయిబాబు, మండల టిడిపి అధ్యక్షుడు అడబాల యుగంధర్, కార్యదర్శి రాపాక నవరత్నం, మాజీ జడ్పీటీసీ మంగెన రాధాకృష్ణ, టిడిపి సీనియర్ నాయకులు మంగెన నరసింహరావు, కేతా శ్రీను, జిల్లెళ్ళ బాబు ప్రసాద్, నల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో రెడ్ క్రాస్ శ‌తాబ్ధి ఉత్స‌వాలు.. గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్