Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీకి దూరంగా అశోక్‌ గజపతి!?

టీడీపీకి దూరంగా అశోక్‌ గజపతి!?
, మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:40 IST)
తెలుగుదేశాన్ని ఎన్‌టీఆర్‌ స్థాపించింది మొదలు మొన్నటి ఎన్నికల ముందు వరకూ విజయనగరం జిల్లాలో టీడీపీకి తిరుగుండేది కాదు. ఏ ఎన్నికల్లో అయినా ఆ పార్టీదే హవా! అన్ని నియోజకవర్గాల్లోనూ పసుపు జెండాల రెపరెపలే కనిపించేవి. నాయకులు ఎన్ని జండాలు మార్చినా.. కార్యకర్తలు మాత్రం ఒకే గుండె మాదిరిగా కలిసుండేవారు.

తెలుగుదేశం పార్టీ అంటే జనానికి ఎనలేని నమ్మకం. ఆ పార్టీ అధినేత పట్ల అచంచలమైన విశ్వాసం. అంత ప్రాభవం ఉన్న పార్టీ ఇప్పుడు కష్టాల కొలిమిలో కరుగుతోంది. దీనికి ప్రధాన కారణం విజయనగరం జిల్లాలో తలెత్తిన నాయకత్వ లోపమే అని విశ్లేషకుల అభిప్రాయం!
 
మొదటినుంచి విజయనగరం జిల్లాలో టీడీపీ అంటే పూసపాటి అశోక్ గజపతిరాజు అన్న ముద్రపడిపోయింది. ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదంగా భాసిల్లింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైంది. అడుగడుగునా నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీపరంగ వ్యూహరచన కూడా కొరవడింది. మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ఈ అంశాలే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చాయని చెప్పాలి.

జనంలో కలిసిపోయి.. దూకుడుగా వ్యవహరించే ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా లేకపోవటం టీడీపీకి మైనస్‌గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేయడంలో గానీ, ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి అధికారపక్ష తప్పిదాలను ఎండగట్టడంలో గానీ జిల్లా టీడీపీ నేతలు విఫలమవుతున్నారు.
 
టీడీపీ సీనియర్‌ నేతగా ఉన్న అశోక్ గజపతిరాజు అవినీతికి ఆమడదూరంలో ఉంటారన్న ఒకే ఒక్క మాటతో ఇంతకాలం నెట్టుకొచ్చారు గానీ.. ఆయనకి నమ్మిన బంటుల్లా వ్యవహరించే ఒకరిద్దరు వ్యక్తులు ఈ జిల్లాలోనే కాదు.. పక్క జిల్లాల్లో కూడా కాంట్రాక్టుల పేరుతో నొల్లేశారట! ప్రభుత్వంలో అశోక్ గజపతిరాజు హవాని ఆసరా చేసుకుని వారు చెలరేగిపోయారట.

అప్పట్లో వైసీపీకి దగ్గరగా ఉన్న కాంట్రాక్టర్లను దూరం పెట్టి ఉద్దేశపూర్వకంగా ఈ దందా నడిపించారనీ, ఇదంతా అశోక్‌ గజపతిరాజుకి తెలిసే జరిగిందనీ ఆ పార్టీ నేతలు గట్టిగా ప్రచారం చేశారు. అశోక్‌ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తనకు భజన చేసే కొందరిని భుజాలపైకి ఎక్కించుకున్నారన్న టాక్‌ కూడా ఉంది. 
 
సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారం తమదేనన్న అతి విశ్వాసం నిలువునా ముంచినా.. ఇప్పటికీ జిల్లా టీడీపీ నేతలు కళ్లు తెరవలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్తు కార్యాచరణపై వారిలో ఆలోచనే లేదట. పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నిక విషయంలోనే అశోక్ గజపతిరాజు పెద్దతప్పు చేశారన్న భావన స్థానిక నాయకుల్లో ఉంది. 
 
అశోక్‌ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్నన్నాళ్లు.. "అయామ్ సెంట్రల్'' అనే వారు! తద్వారా జిల్లా రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పటికీ అదే తీరుని కొనసాగిస్తున్నారన్నది తమ్ముళ్ల అభిప్రాయం. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుండి ప్రజలకే కాదు, పార్టీ కార్యకలాపాలకు కూడా తన అనారోగ్య కారణాల రీత్యా పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

మౌనమే నీ భాష ఓ మూగమనసా అన్నట్లుగా ఉందట అశోక్‌ వ్యవహారశైలి. అరుకు ఎంపీగా పోటీచేసిన వైరిచర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణదేవ్.. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడున్నారన్నది కార్యకర్తలకే కాదు.. పార్టీ నాయకులకు కూడా తెలియదట!
 
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల "అన్నా క్యాంటిన్ల'' మూసివేతకు నిరసనగా, ఇసుక విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తెలుగుదేశం ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే! అయితే విజయనగరం జిల్లాలో మాత్రం ఉన్నతాధికారులకు ఓ వినతిపత్రాన్ని మొక్కుబడిగా అందించి టీడీపీ నేతలు చేతులు దులుపుకున్నారట!

ఈ జిల్లా నుంచి టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా వ్యవహరించిన సుజయ్ కృష్ణరంగారావు ఒకటో అరో అధికారపక్షంపై విమర్శలు చేస్తున్నా ఆ ఎఫెక్ట్‌ పెద్దగా ప్రజల్లో కనిపించడం లేదు. ఇక విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని పార్టీ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.
 
ఇకనైనా రాష్ట్ర నాయకత్వం కల్పించుకుని గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనీ, జనంతో కలిసిఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలనీ, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనీ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలో ప్యాలెస్ లు కడితే ఒప్పుకోం: టీజీ