ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై వైజాగ్ విమానాశ్రయంలో జరిగిన దాడిపై దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది. నిందితుడు శ్రీనివాస్ రావు చెప్పినట్లుగా లేఖ రాసిన వ్యక్తితో పాటు మరొక వ్యక్తిని పోలీసులు విచారించారు.
నిందితుడి స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేల్లంకలోని అతడి బంధువులు, స్నేహితులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు. దాడికి రెండ్రోజుల ముందే శ్రీనివాస్ కొత్త సిమ్ కొనుగోలు చేయడంతో దానికి సంబంధించిన ఫోన్‌కాల్స్‌పై దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు పనిచేసే రెస్టారెంట్ యజమానికి సైతం నోటీసులు జారీచేసి విచారణ చేశారు. ఈ దాడికి సంబంధించి శ్రీనివాస్‌ను ఎవరైనా ప్రలోభపెట్టారా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు గతంలో కొద్దిరోజులు దుబాయిలో పనిచేశాడని, ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేశాడని పోలీసులు తెలిపారు.