దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ అవినీతి బాగోతంపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. సీబీఐను సోకాల్డ్ బీబీఐగా పోల్చారు. బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా ఆమె అభివర్ణించారు.
సీబీఐ ఉన్నతాధికారుల లంచాల బాగోతం యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసిన విషయం తెల్సిందే. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు... అందరి అవినీతిపై దర్యాప్తు చేయాల్సిన సీబీఐ తానే పీకల్లోతు అవినీతిలో కూరుకునిపోయింది. ముఖ్యంగా అవినీతి అక్రమార్కులపై కేసులు పెట్టాల్సిన సీబీఐ తన సంస్థ స్పెషల్ డైరెక్టర్‌పైనే కేసు పెట్టుకుంది.
దొంగల్ని అరెస్టు చేయాల్సిన సీబీఐ తన డీఎస్పీనే అరెస్టు చేసుకుంది. అవినీతిపరుల ఇళ్లపై దాడులు చేయాల్సిన సీబీఐ తన ప్రధాన కార్యాలయంలో తానే సోదాలు చేసుకుంది. ఇంతకాలం 'ప్రభుత్వం చేతిలో పావు' అని ముద్రపడిన సీబీఐ... ఇప్పుడు లంచగొండుల కుట్రల ముఠాగా దుష్కీర్తి మూట గట్టుకొంది.
ముఖ్యంగా, తన మునగడమే కాదు.. దేశ అత్యున్నత గూఢచార సంస్థ రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కూడా తనతోపాటు కట్టగట్టి లంచాల పంకిలంలో నిలువునా ముంచింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలన్నీ విశ్వసనీయత సంక్షోభంలో చిక్కుకున్నాయి.
దేశంలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఒక్కో ప్రతిపక్ష పార్టీ ఒక్కోలా స్పందిస్తున్నాయి. తాజాగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. 'సీబీఐ ఇప్పుడు సోకాల్డ్ బీబీఐ(బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)గా మారిపోయింది. ఇది చాలా దురదృష్టకరం' అంటూ వ్యాఖ్యానించింది. మమత చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.