అవును ప్రశాంత్ కిశోర్ పక్కా ప్లాన్‌తో ఏపీకి వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సీఎం కానున్నారు. ప్రశాంత్ కిశోర్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వైకాపా గెలుపు కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వస్తే... ప్రశాంత్ కిశోర్ పోషించిన పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి.
రెండేళ్ల ముందుగానే 2019 ఎన్నికల కోసం పక్కా ప్రణాళికలను రూపొందించారు పీకే. వాస్తవానికి జగన్ పాదయాత్ర చేస్తే బాగుంటుందనే సలహా ఇచ్చింది కూడా ప్రశాంత్ కిశోరే. కేవలం సలహా ఇవ్వడం మాత్రమే కాదు... ఆ పాదయాత్రకు ప్రజల్లో ఆదరణ పెరగడానికి కూడా ఆయన తన వ్యూహాలను అమలు చేశారు.
సోషల్ మీడియాలో టచ్‌లో వుంటూ.. దాంతో పాటు జగన్ పాదయాత్ర ప్రకటన చేసిన పార్టీ ప్లీనరీ వేదికగానే ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో పాటు సహజంగా ఎప్పుడూ దేవుడిని ఎక్కువగా నమ్మే జగన్ ఈ సారి ముహూర్త బలాన్ని నమ్మారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గంలోనే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని విశ్వసించారు.
ఆయన చెప్పిన ముమూర్తాలు.. సమయం ఆధారంగా తన నిర్ణయాలను అమలు చేశారు. అప్పటి వరకు ఏ ఆశ్రమాలకు గుళ్లకు పెద్దగా వెళ్లని జగన్ ప్రశాంత్ కిశోర్ సలహాల మేరకే స్వామిజీలను కలవడం, దేవాలయాలను సందర్శించడం చేశారు. సోషల్ మీడియా వేదికగా జగన్ ఇమేజ్‌ను బాగా ప్రమోట్ చేయడంలోనూ పీకే పాత్ర ఎక్కువనే చెప్పాలి. ఇలా జగన్ వెంట నిలిచి 2019 ఎన్నికల్లో ఆయనకు సానుకూల ఫలితాలను రాబట్ట గలిగారు.. పీకే.