Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మంగారి మఠం సమస్య పరిష్కారానికి సిద్ధం: మంత్రి వెలంపల్లి

Advertiesment
బ్రహ్మంగారి మఠం సమస్య పరిష్కారానికి సిద్ధం: మంత్రి వెలంపల్లి
విజ‌య‌వాడ‌ , శనివారం, 28 ఆగస్టు 2021 (17:41 IST)
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి పొందిన బ్రహ్మంగారి మఠం సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. కాలజ్ఞానాన్ని ముందుగానే రచించిన మహనీయుడు, దైవ స్వరూపుడు అయిన బ్రహ్మంగారి మఠం విషయంలోనే వివాదాలు రావడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు సందర్భంగా విజయవాడలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. బ్రహ్మంగారి మఠం సమస్యను పరిష్కరించేందుకు తానే స్వయంగా వారి భార్యలు, పిల్లలు, వారసులతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక నిర్ణయానికి రావడం జరిగిందని తెలిపారు. 
అయితే అనంతరం వారిలోని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తిరిగి పెండింగులో పడిందని వివరించారు. ఇప్పుడైనా ఆ విషయంలో తమవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విశ్వబ్రాహ్మణుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు.
 
 ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి, వారికి ఒక భరోసా కల్పించారని చెప్పారు. విశ్వబ్రాహ్మణులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని, వాటిని తక్షణమే పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. 
 
మరో అతిథి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అర్హులైన వారందరికీ అన్ని పథకాలను అందిస్తోందని తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడు జవ్వాది పూర్ణాచారి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో 28 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణుల కోసం ఈ సంఘం పని చేస్తుందన్నారు. మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే విష్ణు చొరవతో తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. 
 
సంఘం ఏర్పాటై 48 సంవత్సరాలు పూర్తవుతున్నసందర్భంగా సేవా కార్యక్రమాలు విస్తృతపరచాలని పిలుపునిచ్చారు. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్నట్లు, ప్రభుత్వం నిధులిస్తున్నా వాటిని అందనివ్వకుండా చేసిన శ్రీకాంత్, తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధి వినుకొండ సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ ఆచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం పరిషత్ చైర్మన్ ఆరికట్ల గోవార్ధన్ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం వైస్ ప్రెసిడెంట్ హేమ సుందర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ యాప్‌లో కొత్త ఫీచర్.. ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూడాలో..?