Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌ ఆస్తులు,రాజకీయాలు అంతా బినామీనే: టీడీపీ

జగన్‌ ఆస్తులు,రాజకీయాలు అంతా బినామీనే: టీడీపీ
, మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (22:03 IST)
బినామీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న జగన్మోహన్‌రెడ్డి, ఆయన సాక్షి మీడియా తెలుగుదేశంపై ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, 5, 6 నెలల నుంచి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జ్యుడీషియల్‌ విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని టీడీపీ నేత, ఆపార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన ఆస్తులు, వ్యాపారాలు, వ్యవహారా లు అన్నీ బినామీలతోనే నడుపుతున్న జగన్మోహన్‌రెడ్డి, ఆఖరికి రాజకీయాల్లోకూడా కేసీఆర్‌కు బినామీగా వ్యవహరిస్తున్నాడన్నారు.

తెల్లరేషన్‌కార్డులున్నవారంతా అమరావతి చుట్టుపక్కల భూములుకొన్నారని, వారంతా తెలుగుదేశం బినామీలని దుష్ప్రచారం చేస్తూ, టన్నులకొద్దీ బురద ప్రతిపక్షంపై చల్లాలని జగన్‌ ఆయన మీడియా ప్రయత్నించ డం సిగ్గుచేటన్నారు.

రాష్ట్రంలోని కుటుంబాలకంటే తెల్లరేషన్‌కార్డుదారులే ఎక్కువగా ఉన్నారని, విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి కూడా తెల్లకార్డులున్నాయని, అలాంటివారు  రాజధాని చుట్టుపక్కల భూములుకొంటే, దాన్ని టీడీపీకి అంటగట్టడం ఎంతవరకు సబబని నిమ్మల నిలదీశారు.

797 తెల్లకార్డులున్నవారు, రాజధాని చుట్టపక్కల గ్రామా ల్లో 600 ఎకరాలవరకు కొన్నారని సాక్షిమీడియాలో పేర్కొన్నారని, అలాకొనడం తప్పయినప్పడు చర్యలు తీసుకోవడం మానేసి బురదజల్లే ఆరోపణలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

వాన్‌పిక్‌పేరుతో 18వేల ఎకరాలను,  లేపాక్షిపేరుతో 6వేల ఎకరాలను తనకంపెనీల్లో పెట్టుబడులుపెట్టిన వారికి అప్పనంగా ధారాదత్తంచేసిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ పేరుతో విషప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరప్షన్‌ ఆఫ్‌ ఎంపరర్‌ పేరుతో పుస్తకాలు ముద్రించి, రాజధాని భూముల్లో 24వేలఎకరాలు దోచేశారని విషప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ, 4వేల ఎకరాలని చెప్పారన్నారు.

ఇప్పుడేమో సాక్షిలో 600 ఎకరాలంటూ కొత్తకథలు చెబుతున్నారని, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌శాఖ వివరాలుపరిశీలిస్తే గత 5ఏళ్లలో కేవలం 125ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్స్‌ జరిగినట్లు స్పష్టమైందన్నారు. అవినీతి అనేది వెలికితీసేకొద్దీ పెరగాలని, కానీ తగ్గడం చూస్తుంటే ఎవరికైనా అది తప్పుడు ప్రచారమనే అనుమానమే కలుగుతుందన్నారు.

రాత్రికిరాత్రి సూట్‌కేసుకంపెనీలు సృష్టించి, వాటిద్వారావచ్చిన సొమ్ముతో రూ.10ల విలువైన షేర్లను వందలు, వేలకు అమ్ముకున్న జగన్‌ కంపెనీలైన భారతిసిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌ వంటివే నిజమైన బినామీ కంపెనీలని నిమ్మల మండిపడ్డారు.

జగన్‌తాత రాజారెడ్డి, 1200 ఎకరాల అసైన్డ్‌ల్యాండ్‌ని ఆక్రమించుకుంటే,  ఆ వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం బయటపెట్టడంతో,  వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి  అసెంబ్లీలో మాట్లాడుతూ, ''ఏదో తెలియక కొన్నాము.. 631ఎకరాలు వెనక్కు ఇచ్చేస్తాము'' అని చెప్పింది వాస్తవం కాదా అని టీడీపీ ఎమ్మెల్యే నిగ్గదీశారు.

క్విడ్‌ప్రో, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనేపదాలకు జగనే బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నారు. అమరావతి ప్రాంతలోని రైతులు,  అసైన్డ్‌భూములను అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని కోరినందునే చంద్రబాబు  ఆనాడు భూములమ్ముకునే హక్కును కల్పించారన్నారు.

అమరావతిని చంపేశాక, అసైన్డ్‌భూములకు కూడా కమర్షియల్‌ ప్లాట్లు ఇస్తానని చెబుతున్న జగన్‌, ఎంతభూమి చ్చినా రైతులకు ఉపయోగం ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు.
 
ఇళ్లస్థలాల కోసం రైతులస్వాధీనంలోని భూముల్ని లాక్కుంటున్నారు..
పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడంకోసం, 70, 80ఏళ్ల నుంచి రైతులు సాగుచేసుకుంటున్న , వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుంటున్న కుంటలు, పుంతలు, లింకురోడ్లు, కల్లాలు, పోరంబోకు, పట్టాభూముల్ని జగన్‌ సర్కారు లాక్కుంటోందన్నారు.

ఎక్కడో ఊరికి దూరంగా ఉండే ఇలాంటి భూముల్ని అటురైతులకు కాకుండాచేసి, ఇళ్లస్థలాల పేరుతో పేదలకు అప్పగించినా ఎంతవరకు ఉపయోగపడతాయో ఆలోచించాలన్నారు.

కుంటలు, పుంతలు, కల్లాలుగా ఉన్న 20, 30, 40సెంట్లభూమిని కేవలం 10, 15 కుటుంబాలకు ఇచ్చినా, ఆభూములన్నీ ఊళ్లకు కిలోమీటర్లపైబడి దూరంగా ఉన్నాయని, వాటిలో ఆయాకుటుంబాలు నివాసమెలా ఉంటాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

అలాదూరంగా ఉన్న స్థలాలకు విద్యుత్‌సౌకర్యం, నీటివసతి, రవాణా వసతి కల్పించడానికి ప్రభుత్వానికి అదనపు భారమవుతుందన్నారు. జగన్‌సర్కారుకు నిజంగా పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధే ఉంటే, ఊళ్లకు పక్కనే ఉండే భూములను ల్యాండ్‌అక్విజేషన్‌ పద్ధతిలో తీసుకొని, అన్నిరకాలుగా ఒకకాలనీగా అభివృద్ధిచేసి స్థలపంపిణీ చేస్తే బాగుంటుందని నిమ్మల హితవుపలికారు.

ప్రజాసేవకులు గా ఉండాల్సిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రభుత్వానికి వత్తాసు పలకడం మంచిపద్ధతి కాదన్నారు. మాజీమంత్రి కే.ఎస్‌.జవహర్‌పై 7, 8 సెక్షన్లుపెట్టి, తప్పుడుకేసులు మోపి, గృహనిర్బంధంలో ఉంచారని నిమ్మల మండిపడ్డారు.

ర్యాలీ చేయడమే జవహర్‌ చేసిన నేరమైతే, వైసీపీవారు చేస్తున్న ర్యాలీలపై ఏంసమాధానం చెబుతారని, వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడంలేదని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి చిక్కుల్లో పడవద్దని రామానాయుడు సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరి వల్ల రోజా ఈ స్థాయికి వచ్చిందో ప్రజలకు తెలుసు: అనిత