ఉద్యమాల ముసుగులో ఆడవాళ్లను ముందుకు పెట్టి, వారి వెనుక దాక్కుని కొన్ని రాజకీయ పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.
పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను అడ్డం పెట్టుకుని చేస్తున్న చిల్లర రాజకీయాలను ఖండించారు. అమరావతిలో పదవులు తీసుకుని, పెత్తనం చేసిన మగవాళ్లు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు.
ఎందుకు ఆడవాళ్లను రోడ్లమీదకు తీసుకువచ్చి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు తీసుకోవడానికి, పెత్తనం చేయడానికి మాత్రమే మగవాళ్లు పరిమితమా అని మండిపడ్డారు. ఆడవాళ్లను ముందుకు నెట్టి వారు అరెస్ట్ అయితే దానిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తున్నారని ఇది ఎక్కడి పాలసీ అని రాజకీయపక్షాలను నిలదీశారు.
ఆనాడు ప్రత్యేక హోదా వద్దు... ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరినప్పుడు మహిళలను అడిగే చేశారా అని ప్రశ్నించారు. దెబ్బలు తింటానికే మహిళలను ముందుకు పెడుతున్న విధానాలను ఖండించాల్సిన అవసరం వుందని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భూములు కొనుగోలు చేసిన మగవాళ్లు, ప్రజాప్రతినిధులు ఏమయ్యారని ప్రశ్నించారు. రాజకీయాల్లో మహిళలను పావులుగా వాడుకుంటున్నారని అన్నారు.
విజయవాడలో బంద్ చేసే సత్తా లేనివారు. ఆడవాళ్లను రోడ్డుమీదకు తీసుకువచ్చి, ఎండలో మీచావు మీరు చావండి అని వదిలివేస్తారా అని మండిపడ్డారు. పదువులకు మగవాళ్లు, ఉద్యమాలకు మహిళలు కావాలా అని ప్రశ్నించారు. కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ తప్పుడు విధానాలను అందరూ ఖండించాలని అన్నారు.