ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా విద్యాలయాలను కూడా మూసేశారు.
అయితే వచ్చే 14వ తేదీ నుంచి లాక్ డౌన్ ఎత్తేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విద్యాలయాలు తెరిచేది అనుమానంగానే వుంది. స్కూళ్లు తెరిస్తే విద్యార్థులు గుంపులు గుంపులుగా చేరటం ఖాయం.
ఫలితంగా సామాజిక దూరానికి విఘాతం కలుగుతుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితి రాకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
ఇప్పటికే ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండా ఆల్ పాస్ ఉత్తర్వులు ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా వేశారు. విద్యా క్యాలెండర్ ప్రకారం ఈ నెల 23 వరకు స్కూళ్లు పని చేస్తాయి. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.
ఈ నెల 14 తరువాత ఈ విద్యా సంవత్సరంలో ఆదివారాలు పోనూ ఇంకా 7 పనిదినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తాజా పరిస్ధితుల్లో ఈ కొద్ది రోజులు స్కూళ్లు తెరిపించినా ఒనకూరే ప్రయోజనం ఏమీ లేదని భావిస్తున్నారు.
ఒకేసారి వేసవి సెలవుల వరకు అంటే జూన్ 11వ తేదీ వరకు స్కూళ్లు మూత తప్పదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.