మత పరమైన సదస్సులు, సమావేశాలు మంచిది కాదు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

శనివారం, 4 ఏప్రియల్ 2020 (15:17 IST)
మానవాళి మనుగడ కోసం చేపడుతున్న లాక్ డోన్ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు తనదిగా భావించాలని అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్ పేర్కొన్నారు. చివరి రోజు వరకు ఎటువంటి వెసులు బాటు లేకుండా దీనిని పూర్తి చేయాలన్నారు.

కరోనా వ్యాప్తి నేపధ్యంలో మత పరమైన సదస్సులు, సమావేశాలు మంచిది కాదని, ఆ మేరకు మత పెద్దలు ప్రజలకు తగిన సూచనలు చేయాలని హరిచందన్ పిలుపు నిచ్చారు. సాధారణంగా మత పరమైన కార్యక్రమాల వల్ల సమూహాలు ఏర్పడతాయని తాజా పరిస్ధితులలో ఇది ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదన్నారు.

కరోనా కారణంగా లాక్ డోన్ కొనసాగుతున్న వేళ గవర్నర్ గౌరవ హరిచందన్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సామాజిక దూరమే కీలకం అయినందున ప్రతి ఒక్కరూ తదనుగుణంగా వ్యవహరించాలని, అవసరమైతే మరికొందరికి సామాజిక దూరం ఆవశ్యకతను సామాజిక మాధ్యమాల ద్వారా వివరించాలని సూచించారు.
 
ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను తూచా తప్పకుండా పాటించటమే దేశ పౌరులుగా సమాజానికి చేయగలిగన సేవ అని గవర్నర్ ప్రస్తుతించారు. కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో వైద్య సేవలో నిమగ్నమై ఉన్న సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

కొన్ని ప్రాంతాలలో వైద్య ఆరోగ్య సిబ్బంది విధులను అడ్డుకోవటం వంటివి చేస్తున్నారన్న సమాచారం ఆందోళన కలిగిస్తుందని, ఈ తరహా పరిస్ధితులు ఏమాత్రం వాంఛనీయం కాదని రాష్ట్ర రాజ్యాంగాధినేత స్పష్టం చేసారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వారు ఎంతో కష్టపడుతున్నారని వారిని ప్రోత్సహించేలా సమాజం వ్యవహరించాలని గవర్నర్ అన్నారు.

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.  కృతనిశ్చయం, సంయమనం ప్రాతిపదికన కరోనా వైరస్ కు చరమగీతం పాడాలన్న ప్రధాని పిలుపు లభిస్తున్న స్పందన అపూర్వమైనదని, కరోనా అతి వేగంగా విస్తరిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తుండగా, లాక్ డోన్ కాల పరిమితి ముగిసే వరకు బయట తిరగకుండా ఇంటి వద్దే ఉండాలన్నారు.
 
అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా వ్యాప్తి గొలుసును అధికమించగలుగుతామన్నారు. స్వచ్ఛంధ సంస్ధలతో పాటు రెడ్ క్రాస్, ఎన్ సిసి, స్కౌట్స్, గైడ్స్, ఎన్ఎస్ఎస్ వంటి వ్యవస్ధలు కీలక బాధ్యతలు నిర్వర్తించటం ముదావహమన్నారు.

అయా సీజన్ల మేరకు జరగవలసిన వ్యవసాయపనులను వాయిదా వేయలేమని, ఈ పరిస్ధితిలో వారికి ప్రభుత్వం అందించిన మినహాయింపును అత్యంత జాగ్రతగా వినియోగించుకోవాలన్నారు.

వ్యవసాయ పనులలో సైతం సామాజిక దూరం అవసరమని, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వ తీసుకుంటుందని గవర్నర్ అన్నారు. ఈ మేరకు శనివారం రాజ్ భవన్ ప్రకటన వెలువరించింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం విమానంలో ఎక్కారు, పక్కన కూర్చున్నారు, వైరస్ అంటించారు, ఎక్కడ?