కృష్ణా జిల్లా మైలవరం ఆరుగాలం కష్టించి పండించిన ప్రత్తి పంటను అమ్ముకుని ఫలితం చేతికొస్తుందనుకున్న తరుణానికి డబ్బు రావలసిన కొనుగోలుదారు నుండి ఐపీ నోటీసులు అందడంతో లబోదిబో మంటూ రోడ్డెక్కారు మండలంలోని పుల్లూరు పరిసర ప్రాంత ప్రత్తి రైతులు. గత 10 సంవత్సరాలుగా ప్రత్తి రైతుల వద్ద ప్రత్తి కొనుగోళ్ళు జరుపుతూ, సుపరిచితంగా మెలుగుతూ లావాదేవీలు నిర్వహిస్తున్న పుల్లూరు పంచాయతీ కొత్తగూడెం వాస్తవ్యుడు కరుణ వర ప్రసాద్‌కు.
ఎప్పటిలాగానే చేతికొచ్చిన తమ ప్రత్తి పంటను అమ్మామని, తీరా డబ్బు ఇవ్వాల్సిన సమయానికి ఇదుగో అదుగో అంటూ కాలయాపన చేస్తూ ఐపీ నోటీసులు పంపాడనీ వాపోయారు ప్రత్తి రైతులు. ఎన్నో ఆశలతో పంటను అమ్మి పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, అప్పులూ అంటూ పలు రకాలుగా ఇబ్బందులను ఎదుర్కుంటున్న తమకు ఇలా డబ్బు ఇవ్వకుండా కోర్టులో తేల్చుకోమంటే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరుణ వరప్రసాద్ సుమారు 175 మంది రైతులకు ఐదు కోట్ల వరకు డబ్బు ఎగనామం పెట్టాడని రైతులు ఆరోపిస్తున్నారు. కొత్తగూడెం జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ధర్నాకి దిగడంతో ఒకానొక సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆత్మహత్యే శరణ్యమంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగిన రైతులతో మైలవరం సీఐ శ్రీను, ఎస్ఐ ఈశ్వర రావు మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సీఐ తెలిపడంతో ఆందోళన విరమిస్తున్నామని, ప్రభుత్వం తమను ఆదుకుని న్యాయం చేయాలని కర్షకులు కోరుతున్నారు.