2019 ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీ ఓటమికి గల కారణాలను అధ్యయనం చేసింది.సమస్యలు తెలుసుకొని చికిత్స మొదలెట్టింది.పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మరో మూడు దశాబ్దాలకు సరిపడా ఊపిరి పొయ్యడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు చర్యలు తీసుకున్నారు.
పార్టీ నాయకులతో సుదీర్ఘ సంప్రదింపులు చేసి అనేక నూతన ఆవిష్కరణలతో పార్టీకి నూతనుత్తేజం తేవాలని నిర్ణయించారు.ప్రజలకు మరింత చేరువవ్వడం,ఎక్కువ మంది యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు.ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ లో ఉన్న జిల్లా పార్టీ విధానం స్థానంలో పార్లమెంట్ పార్టీ విధానాన్ని తీసుకురానున్నారు.
ఇప్పటి వరకూ ఏ పార్టీ చెయ్యని ప్రయోగం టిడిపి చేయనుంది.పార్లమెంట్ పార్టీ విధానం వలన ప్రజలకు మరింత దగ్గర అయ్యే అవకాశాలు,ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు మరింత లోతుగా అర్ధం చేసుకొని వారి పక్షాన పోరాడటానికి ఉపయోగపడుతుంది అని పార్టీ అభిప్రాయపడుతోంది.అంతే కాకుండా ఈ నూతన మార్పు వలన యువనాయకత్వానికి ఎక్కువ అవకాశాలు కల్పించడానికి వెసులుబాటు వస్తుంది.
సరికొత్త నాయకత్వం,ప్రజలకు చేరువలో పార్టీ టిడిపి విధానంగా ఉండబోతుంది.అనేక సంప్రదింపులు తరువాత టిడిపి అధినేత ఈ నెల 27న నూతన పార్లమెంట్ పార్టీ విధానాన్ని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు.పార్లమెంట్ పార్టీ విధానంతో గ్రామ స్థాయి కార్యకర్తలకు నాయకత్వం మరింత చేరువవ్వడం,క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకొని యుద్ధప్రాతిపదికన స్పందించేందుకు అవకాశం ఉంటుంది.
25 మంది పార్లమెంట్ పార్టీ అధ్యక్ష పదవులు,13 మంది జిల్లా సమన్వయకర్తల పదవులు,13 పార్లమెంట్ ఇంచార్జ్ పదవులు ఆదివారం టిడిపి ప్రకటించనుంది.రెండు పార్లమెంట్ల కు కలిపి ఒక్క పార్లమెంట్ ఇంచార్జ్ ఉంటారు.ఒక్క అరకు పార్లమెంట్ కి మాత్రం ప్రత్యేకంగా ఇంచార్జ్ ని నియమించనుంది టిడిపి.మొత్తంగా 51 పదవులను ప్రకటించనుంది.
సామాజిక న్యాయం,యువ నాయకత్వానికి ప్రాధాన్యం,సీనియర్ నాయకులకు సముచిత స్థానం విధానంగా ఈ జాబితా సిద్దమయ్యిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.ఇప్పటి వరకూ ఏ పార్టీ చెయ్యని ప్రయోగం,సరికొత్త విధానాలతో టిడిపి ప్రజల ముందుకొస్తుంది.
ప్రయోగాలు చెయ్యడానికి ఇది సరైన సమయం,రిస్క్ తీసుకున్నా పెద్దగా వచ్చే నష్టం ఏమి ఉండదు అని భావిస్తున్న టిడిపి అధినాయకత్వం రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకోనుంది.