Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"మళ్లీ కవిగానే పుడతా... తెలుగు దేశంలో మాత్రం కాదు!!"- ఎవరు? ఎందుకు?

, శుక్రవారం, 22 నవంబరు 2019 (15:47 IST)
ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు... ప్రముఖ నటుడు, కవి, రచయిత, అన్నింటికీ మించి ఓ భాషాభిమాని.... ఆయనే తనికెళ్ల భరణి. ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు.. అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటో.... ఆయన మాటల్లోనే.....
 
"అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం" అని చలంగారన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపించిందేమో. మహాభారతాన్ని కూడా మాటల్లేకుండా తీయగలను అనే నమ్మకం నాది.
 
వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలన్న ఆశ నాది. కానీ తెలుగు దేశంలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత అనాదరణ అరుచి, నిర్లక్ష్యం ఎక్కడా లేదు. హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లో ఆయన మునిమనవడు కాఫీపొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడికీ పట్టదు.
 
గురజాడ బంగారు కళ్లద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాథుడు లేడు. సుబ్రమణ్య భారతి అనగానే..... తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే..... 'అల్లూరి సీతారామరాజులో పాటలు రాశాడు... ఆయనేనా?' అని అడుగుతారు. మనకు అంతే తెలుసు.
 
కవులు బతికుండగానే చస్తారు. చచ్చాక బతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి రంగాచార్య.... వీళ్లను మించినోళ్లున్నారా? కానీ వాళ్లెవరో మనకు తెలీదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్లి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేసేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడెవరికీ తెలీదు. వేరే భాషల్లో వేరే సంస్కృతులంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు, షర్టులు వేసుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి... పార్లమెంటుకు కూడా పంచె కట్టుకునే వెళ్తారు. 
 
తెలుగుకు ఆ శక్తి ఉంది.... 
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితల్ని పిలిపించి ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఓ రచయిత "తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్" అని ఆవేదన వ్యక్తం చేశారట.
 
"తెలుగు భాషకు ఏమీ కాదు. ఎందుకంటే తనను తాను బతికించుకోగల శక్తి తెలుగుకి ఉంది." అన్నారట పీవీ. అవును... తెలుగు చావదు. దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమస్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం ఎదురుచూద్దాం"
 
ఇది భరణి ఆవేదన మాత్రమే కాదు. ప్రతి రచయితది కూడా. నిజమే భరణి అన్నట్లుగా తెలుగును ఎవరో బయటి వాళ్లు వచ్చి చంపలేరు. మన తెలుగువాళ్లే చంపుతున్నారు. నిజమే.... చిన్నపిల్లలు అమ్మ-నాన్న అని పిలిస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా వాళ్లను చూసి మమ్మీ-డాడీ అని పిలవమని మనమే వాళ్లకు సూచిస్తున్నాం. ఇప్పటి తరం పిల్లలకు కనీసం తెలుగు దినపత్రిక చదవటం కూడా సరిగ్గా రాదు. 
 
ఇక తెలుగు రాయటం అంటారా.... అబ్బో అదో బ్రహ్మ విద్య. ఓ సినిమాలో చెప్పినట్టు... దెబ్బ తగిలితే అమ్మా అనడం మానేసి... షిట్ అనే అశుద్దాన్ని పలుకుతున్నాం. మారాలి.... మనం మారాలి. మన ఆలోచన మారాలి. మన పిల్లలకు తెలుగు నేర్పాలి. ప్రతి ఇంట్లో చక్కటి తెలుగు మాట్లాడాలి. మన చిన్నతనంలో వేమన శతకం, సుమతీ శతకం నేర్చుకున్నాం. ఇప్పటి పిల్లలకు వేమన ఎవరో కూడా తెలీదు. అది మన దౌర్భాగ్యం. 
 
మా తెలుగు తల్లికి మల్లెపూదండ.... మా కన్నతల్లికి మంగళారతులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీఎస్ ఆర్టీసీ సమ్మె కొనసాగింపు, డిపోలకు వెళ్లినా బస్సు తాళాలివ్వని అధికారులు