సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు సాధించింది జనసేన పార్టీ. అయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని మట్టికరిపించడమే కాకుండా ఆ పార్టీ పెద్దగా సీట్లు గెలుచుకోలేని విధంగా చేయగలిగింది. ఎన్నికల్లో జనసేన ప్రభావం ఉంటుంది. మాకు అధికారం ముఖ్యం కాదు. ప్రజలే ముఖ్యమంటూ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చెబుతూ వచ్చారు.
చెప్పినట్లుగానే ప్రజల్లోకి వెళ్ళారు. అయితే వైసిపి విజయం తరువాత పవన్ కళ్యాణ్ కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉన్నారు. కానీ మళ్ళీ ఇసుక కొరతపై పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టారు. విశాఖ వేదికగా జరిగిన ఇసుక కొరత లాంగ్ మార్చ్‌లో ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. దీంతో ఆ కార్యక్రమం బాగా విజయవంతమైందన్న సంతోషంలో ఉన్నారు జనసేన పార్టీ నేతలు.
ఇలాంటి సమయంలోనే పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని.. స్థానిక సంస్ధల ఎన్నికల్లోను జనసేన సత్తా చాటే విధంగా చూడాలని, అంతకన్నా ముఖ్యంగా ఎపి సిఎం సొంత ప్రాంతం రాయలసీమలో పార్టీని బలోపేతం చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట పవన్ కళ్యాణ్. దీంతో పార్టీకి కొన్నిరోజుల పాటు దూరంగా ఉంటూ వస్తున్న జె.డి.లక్ష్మీనారాయణకు జనసేన రాయలసీమ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారట.
గతంలో తాను రాయలసీమలోనే కార్యాలయాన్ని ప్రారంభిస్తానని, అనంతపురం నుంచే పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఆ తరువాత అక్కడి నుంచి కాకుండా వేరే ప్రాంతాల నుంచి పోటీ చేశారు. కానీ ప్రస్తుతం రాయలసీమలో ఎన్నో సమస్యలు ఉండటం.. జెడీ.లక్ష్మీనారాయణకు ఆ సమస్యపై అవగాహన ఉండటంతో పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఆయనకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చేశారట.
ఇక నుంచి జె.డి.లక్ష్మీనారాయణ రాయలసీమ జిల్లాల్లోనే పర్యటిస్తూ ప్రజల సమస్యను తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పోరాటం వైపు వెళ్ళేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.