Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పులు ఎగ్గొట్టడానికి చచ్చినట్టుగా నాటకం... ఎక్కడ?

ఈ కాలంలో మోసం చేసేవాళ్లు ఎక్కువైపోతున్నారు. తమ అవసరాల కోసం అప్పు తీసుకుని, ఆ అప్పును తిరిగి చెల్లించేందుకు మనసు రావడం లేదు. పైగా, తీసుకున్న అప్పును ఎగ్గొట్టడానికి కొత్తకొత్త వేషాలు వేస్తున్నారు.

అప్పులు ఎగ్గొట్టడానికి చచ్చినట్టుగా నాటకం... ఎక్కడ?
, గురువారం, 14 జూన్ 2018 (12:07 IST)
ఈ కాలంలో మోసం చేసేవాళ్లు ఎక్కువైపోతున్నారు. తమ అవసరాల కోసం అప్పు తీసుకుని, ఆ అప్పును తిరిగి చెల్లించేందుకు మనసు రావడం లేదు. పైగా, తీసుకున్న అప్పును ఎగ్గొట్టడానికి కొత్తకొత్త వేషాలు వేస్తున్నారు. తాజాగా ఓ షేర్ బ్రోకర్ తీసుకున్న అప్పులు చెల్లించలేక చనిపోయినట్టుగా ఓ నాటకానికి తెరతీశాడు. చివరకు ఆ సీన్‌ను రక్తికట్టించలేక పోలీసులకు చిక్కిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో వెలుగు చూసింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కర్నూలు జిల్లా బనగానపల్లెకి చెందిన బెక్కం సునీల్‌ రెడ్డి హైదరాబాద్ జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉంటూ షేర్ మార్కెట్ ట్రేడింగ్ విశ్లేషకుడిగా, బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా 3 వేల మందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, పెట్టుబడులపై పలు సూచనలు, సలహాలు ఇస్తూ కొద్దిరోజుల్లోనే మంచి పేరు సంపాదించాడు. 
 
అయితే, సునీల్‌ రెడ్డి ట్విట్టర్ గ్రూపులో కొండాపూర్ ప్రాంతానికి చెందిన నరేశ్ బాబు.. అతడి చిట్కాలతో కొంతలాభం పొంది అతడిని అనుసరించాడు. ఇదే అదునుగా నరేశ్‌ బాబు నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఇలా ఏకంగా పది లక్షల రూపాయల వరకు బాకీపడ్డాడు. ఆ తర్వాత సునీల్‌ రెడ్డి స్పందించలేదు. ఓ రోజు భరత్ పేరుతో నరేశ్‌బాబు ఫోన్‌‌కు ఓ మెసేజ్ వచ్చింది. రోడ్డు ప్రమాదంలో సునీల్‌ రెడ్డి చనిపోయాడు అనేది సందేశ సారాంశం. దీన్ని అనుమానించిన బాధితుడు నరేశ్‌ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఖంగుతిన్నారు. ఆ తర్వాత సునీల్‌ రెడ్డిని అరెస్టు చేశారు.
 
అతనివద్ద జరిపిన విచారణలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. షేర్ మార్కెట్‌లో నష్టాలు రావటం.. తిరిగి చెల్లించే స్థోమత లేకపోవటంతో.. చనిపోయినట్లు నాటకానికి తెరతీసినట్టు చెప్పాడు. బాధితులకు డబ్బులు ఎగ్గొట్టేందుకే భరత్ పేరుతో మెసేజ్‌‌లు పంపినట్లు అంగీకరించాడు. ట్రేడింగ్‌‌లో నష్టం రావడంతో ఈ స్కెచ్ వేశానని వెల్లడించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంచలనం రేపిన చిన్నారి నాగవైష్ణవి కేసులో నేడు తుది తీర్పు