తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మిక శాఖామంత్రి సీహెచ్. మల్లారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ సైకిలిస్టును చూసి చలించిపోయారు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కారులోనే స్వయంగా ఆస్పత్రికి తరలించి, దగ్గరుండి వైద్య సేవలు చేయించారు. ఈ విషయంలో మంత్రి చూపిన ఔదార్యం, చొరవను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని బాలా నగర్ జంక్షన్ వద్ద సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తిని లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత లారీ వెనుక చక్రం ఓ కాలిపై ఎక్కడంతో నుజ్జు నుజ్జు అయింది.
ఆ వెనుకనే మంత్రి కాన్వాయ్ వచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి రోడ్డుపై జీవచ్ఛవంలా పడివున్న క్షతగాత్రుడుని చూసి మంచి మల్లారెడ్డి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి.. గాయపడిన వ్యక్తి పరిస్థితిని గమనించి ఎస్కార్ట్ వాహనంలో అతడిని నారాయణ మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి వైద్యం చేయించారు. బాధితుడి ప్రాణానికి అపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని బాలస్వామి(55) గుర్తించగా, తాపీ మేస్త్రీగా జీవనం సాగిస్తున్నట్టు వెల్లడైంది.