ఏపీలోని కడప జిల్లాలో దారుణం జరిగింది. స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో భార్యను అత్యంత కిరాతకంగా వేధించి ఆ తర్వాత హత్య చేశాడో కిరాతక భర్త. భార్యను సిగరెట్లతో కాల్చి, ఆ తర్వాత హత్య చేశాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప పట్టణంలోని అల్లూరి సీతారామరాజునగర్‌కు చెందిన చాందిని (22), మారుతి భార్యాభర్తలు. మారుతి ముస్లిం అయినప్పటికీ అతడి తల్లిదండ్రులు అతడికి హిందూ పేరు పెట్టారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు వల్లీ ఉన్నాడు. చాందినీ ప్రస్తుతం గర్భవతి. దుకాణాల్లో సాంబ్రాణి వేసి జీవించే మారుతి వివాహ సమయంలో కట్న కానుకల కింద నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడు.
ఆ తర్వాత అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. గత పది రోజులుగా ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అతడికి అత్తమామలు, ఆడబిడ్డ కూడా తోడైంది. మరోవైపు మారుతి సిగరెట్లతో భార్య ఒళ్లంతా వాతలు పెడతూ పైశాచిక ఆనందం పొందేవాడు. ఇటీవల తనకు టచ్ ఫోన్ (స్మార్ట్ ఫోన్) కావాలని మారుతి అడిగాడు. అమ్మను డబ్బులు అడిగి త్వరలోనే కొనిస్తానని ఆమె హామీ ఇచ్చింది.
అడిగి రెండు రోజులైనా ఫోన్ తీసుకురాలేదన్న కోపంతో శుక్రవారం రాత్రి ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. ఆపై కత్తితో గాయపరిచాడు. అతడి దెబ్బలకు తాళలేని చాందిని మృతి చెందింది. దీంతో భర్త, అత్తమామలు చనిపోయిన ఆమెను అలాగే వదిలేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. శనివారం ఉదయం ఇంటికి వచ్చిన బంధువులు రక్తపుమడుగులో పడి ఉన్న చాందిని మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.