జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక పెనుగొండ ఊరు పేరును 'శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ'గా మారుస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి కుంబాభిషేకం, విగ్రహప్రతిష్టాపన మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎతైన , పంచలోహలతో తయారైన 90 అడుగుల శ్రీ వాసవీకన్యకా పరమేశ్వరి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ ప్రాంగణం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "ధర్మం దారి తప్పినప్పుడు ప్రాణం కంటే మానం గొప్పదని భావించి ఆత్మార్పణ చేసుకున్న పవిత్రమూర్తి కన్యకాపరమేశ్వరి అమ్మవారు. ఆమె జన్మించిన ఊరుగానే కాదు, ఆత్మార్పణ చేసుకున్న పవిత్ర స్థలంగానూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు విశిష్ట స్థానం ఉంది.
నాతోపాటు ఇన్నివేల మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మనం చేసుకున్న పుణ్యం. భక్త జనకోటి కొంగు బంగారంగా విశేష పూజలందుకుంటున్న ఆ తల్లి విగ్రహాన్ని దర్శించుకునే బాగ్యం కలిగించినందుకు ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ చల్లని తల్లి శుభాశీస్సులు రాష్ట్రంలోని అందరి ఆడపడుచులపై ఉండాలని కోరుకున్నాన"ని అన్నారు.
* శాస్ర్తోక్తంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ
అంతకు ముందు పెనుగొండ వాసవీ మాత దర్శనానికి విచ్చేసిన శ్రీ పవన్‌కళ్యాణ్ గారికి ఆలయ లాంఛనాల ప్రకారం వేదపండితుల మంత్రోచ్చరణలు, మంగళవాద్యాలతో ఆలయం లోపలికి ఘనస్వాగతం పలికారు. శ్రీ వాసవీ మాత భారీ విగ్రహాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారి పాదభాగంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించిన శ్రీ పవన్‌కళ్యాణ్
అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్‌లో పైభాగం వరకు వెళ్లి అమ్మవారిని ఆద్యంతం దర్శించి తరించారు. విగ్రహ ముఖభాగం వద్ద కూడా పూజలు చేసి ప్రణామాలు సమర్పించారు. శ్రీ వాసవీ కన్యకా పరవేశ్వరి అమ్మవారి సుప్రసిద్ధ క్షేత్రంగా వెలుగొందుతున్న పెనుగొండలో రూ. 17 కోట్లతో శ్రీ వాసవీమాత 90 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన, కుంబాభిషేక మహోత్సవాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ ఆహ్వానం మేరకు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు గురువారం ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.
* జనసేన నినాదాలతో మార్మోగిన పెనుగొండ
అమ్మవారి దర్శనానికి శ్రీ పవన్‌కళ్యాణ్ గారు వస్తున్న విషయాన్ని తెలుసుకుని జనసైనికులు, జనసేన పార్టీ అభిమానులు ఉదయమే పెద్ద సంఖ్యలో పెనుగొండ చేరుకున్నారు. ఆయన దిగేందుకు ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నుంచి ఆలయం వరకు ఇసుకవేస్తే రాలనంత సంఖ్యలో నిండిపోయారు. హెలీ ప్యాడ్ నుంచి అమ్మవారి ఆలయం వరకు అడుగడుగునా శ్రీ పవన్‌కళ్యాణ్ గారిపై పూల వర్షం కురిపించారు. పెనుగొండ ప్రాంతం జనసేన నినాదాలు, జనసైనికుల జయజయధ్వానాలతో దద్దరిల్లింది.