నెల్లూరు జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు అనేక మంది నేతలు పోటీపడుతుంటారు. నిన్నామొన్నటివరకు ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డిలు నియోజకవర్గంలో అలజడి సృష్టించారు. వీరిద్దరూ ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది.
ఇదిలావుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా ఓ బేల్దార్ మేస్త్రి పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన పేరు పసుపులేటి సుధాకర్. సొంతూరు బోగులు మండలంలోని చెంచులక్ష్మీపురం. కొన్నేళ్ళ క్రితం బేల్దార్ మేస్త్రిగా హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ క్రమంగా నిలదొక్కుకున్న తర్వాత త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ అనే కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత బడా కాంట్రాక్టర్‌గా అవతరించారు.
ఈయన జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ఆయన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు గత 15 రోజులుగా ఊపందుకున్నాయి. ఆలయాలను నిర్మాణాలను ఉదారంగా నిర్మిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి బోర్లు వేయిస్తున్నారు. రోడ్లు వేయిస్తున్నరారు. పాడుబడిన స్కూల్ భవనాల స్థానంలో కొత్త గదులు నిర్మిస్తున్నారు.
ఈ పనులకు ఆయన తన సొంత డబ్బునే వెచ్చిస్తున్నారు. అంతేనా, కప్పరాళ్లతిప్ప పోలీస్ స్టేషన్ రూపురేఖలు మార్చేశారు. బిట్రగుంట జడ్జీ హైస్కూల్‌ను ఏసీ స్కూల్‌గా మార్చేశారు. ఈ స్కూల్ విద్యుత్ బిల్లులను కూడా ఆయనే స్వయంగా చెల్లిస్తున్నారు. ఇలా పలు అభివృద్ధి పనులు చేయిస్తూ నియోజకవర్గంలో 'సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్'గా మారారు.