ఎన్నికల నగారా త్వరలోనే మోగనుండడంతో పవన్ కళ్యాణ్ తన పార్టీని సమాయత్తం చేసే దిశగా పలు వ్యూహాలు రచించుకుపోతున్నారు. దానికి తగినట్లే జనసేన పార్టీలోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. అయితే... ఇక్కడే పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని భోగట్టా.
తన పార్టీలో బలమైన నేతలకు కాకుండా మేథావులకు చోటు కల్పించే దిశగా ముందుకు పోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్యలు చదువుకున్న చాలామంది ఈ పార్టీలో చేరి ఉండడం తెలిసిందే. కాగా పవన్ తన పార్టీలోకి దాదాపు... విద్యావంతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థాయి అధికారులు, మాజీ పోలీస్ అధికారులు, మాజీ ఐఏయస్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు ఇలా పలువురు ప్రముఖులనే ఆహ్వానిస్తూ ఉండడం గమనార్హం.
అయితే... తాజాగా దీనిపై స్పందించిన మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు. 'ప్రజా సేవ చేయడానికి విద్యావంతుల సహాయం తీసుకుంటే దానికొక విలువ, అర్ధం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని వాళ్లపై నమ్మకం ఉంచి, గౌరవంతో జనసేన పార్టీలోకి తీసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేసిన మనోజ్ ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ.. పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న తనను పరిగణించమని పరోక్షంగా ఏమైనా అభ్యర్థిస్తున్నారేమోనని కూడా పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
కాగా... మనోజ్ ట్వీట్‌ని చూసిన పవన్ అభిమానులు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరి భవిష్యత్తులో పవన్, మనోజ్‌లు రాజకీయపరంగా కలిసి పని చేస్తారేమో చూడాలి... ఇది మరో మల్టీస్టారర్ రాజకీయం అవుతుందే వేచి చూద్దాం...