కొవిద్-19 నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ఆర్థిక ప్యాకేజి అమలుపై సోమవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ (ఎస్ఎల్సి) ప్రాధమిక సమావేశం జరిగింది.
ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇస్తూనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీని పటిష్టంగా అమలు చేయడం ద్వారా సమాజంలోని పేదలు సహా ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.
ఆ దిశగా సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళిక లు సిద్ధం చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం ప్రకటించిన ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీతో ఏఏ శాఖకు ఎంత మేరకు నిధులు సమకూరుతుందో అంచనా వేసి ఆప్రకారం వివిధ పధకాల ద్వారా ప్రజలందరికీ లబ్ది చేకూర్చేందుకు చర్యలు చేపట్టాలని సిఎస్ నీలం సాహ్ని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులను ఆదేశించారు.
ఈ విషయమై వచ్చే సమావేశంలో సవివరంగా చర్చిద్దామని ఆలోగా శాఖల వారీ పూర్తి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సిఎస్ ఆదేశించారు. అంతకు ముందు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీతో రాష్ట్రంలోని వివిధ శాఖల ద్వారా కలిగే ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఆలాగే వ్యవసాయ,పాడి పరిశ్రమాభివృధ్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కార్మిక ఉపాధి కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి బి.ఉదయలక్ష్మి,ఇంధన మరియు మున్సిపల్ పరిపాలన శాఖల కార్యదర్శులు ఎన్.శ్రీకాంత్,జె. శ్యామలరావు, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం వారి వారి శాఖలకు సంబంధించి ఎంతమేరకు ఆర్ధిక ప్యాకేజి లబ్ధి కలుగుతుందనే వివరాలను తెలియజేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ,ఎస్ఎల్బిసి కన్వీనర్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.