Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాస్క్ అడిగినందుకే డాక్టర్ సుధాకర్ సస్పెండ్: చంద్రబాబు

మాస్క్ అడిగినందుకే డాక్టర్ సుధాకర్ సస్పెండ్: చంద్రబాబు
, మంగళవారం, 19 మే 2020 (05:06 IST)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం పార్టీ ముఖ్యనేతలతో, ప్రజా ప్రతినిధులతో ఆన్ లైన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... విశాఖ దళిత డాక్టర్ సుధాకర్ రావు 74ఏళ్ల తల్లి ఆవేదన కలిచివేసింది అన్నారు.

‘‘బంగారం లాంటి నా కొడుకును, డాక్టర్ చదువుకున్న నా బిడ్డపై పిచ్చోడి ముద్ర వేశారు. మాస్క్ అడిగినందుకు సస్పెండ్ చేసి ఈ పరిస్థితి తెచ్చారు. ఇంకా ఎంత మందిని ఇలా చేస్తారో..? 25ఏళ్లుగా డాక్టర్ గా చేస్తున్నాడు,  ఎంతో మంచిపేరు తెచ్చుకున్నాడు, కష్టపడి డాక్టర్ చదివించాను, అలాంటి బిడ్డను సస్పెండ్ చేసి ఇలా చేస్తారా..? 

నా వయసు 74ఏళ్లు, ఈ వయసులో నన్నిలా క్షోభ పెడతారా..? నా కొడుకుపై పిచ్చాడని ముద్ర వేస్తారా..? మద్యం తాగిన వాళ్లను మెంటల్ ఆసుపత్రికి తీసుకువస్తారా..? మద్యం ఎందుకు అమ్ముతున్నారు మీరు..? నువ్వు అమ్మబట్టే కదా తాగుతోంది..మద్యం తాగితే కెజిహెచ్ కు తీసుకెళ్లాలిగాని మెంటల్ ఆసుపత్రిలో ఎలా చేరుస్తారు..? బెడ్ రిడెన్ అయిన తండ్రిని ప్రతిరోజూ చూసేవాడు, సస్పెండ్ అయ్యానన్న బాధలో తండ్రి దగ్గరకు కూడా రాలేదు.

ఈ వయసులో నాకెందుకీ క్షోభ..? నా బిడ్డను ఎలా ఉన్న డాక్టర్ ను అలా నాకు అప్పచెప్పాలి. నా కొడుకును నాకు ఆరోగ్యంగా అప్పజెప్పాలి. లేకపోతే సహించేది లేదు. నా బిడ్డను మామూలు పొజిషన్ లో నాకు అప్పజెప్పాలి, ఇంత కన్నా ఈ ప్రభుత్వాన్ని కోరేదేమీ లేదు, వాడికేమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ’’ వృద్దాప్యంలో ఆ తల్లి ఆవేదన అందరినీ కలిచివేసింది.
 
మాస్క్ అడిగినందుకే డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేశారు. తమ తప్పులు కప్పిపెట్టుకోడానికి ఒక కమిటీ వేసి మానసిక రోగిగా చిత్రించారు. మాస్క్ ల గురించి ఆయన అడిగిన తర్వాతనే రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు డాక్టర్లు చనిపోయారు. దళిత డాక్టర్ సుధాకర్ కు చేసిన అన్యాయాన్ని, ఆయనపై దాడిని అందరూ ఖండించాలి. ఆయనపై తప్పుడు కేసులు ఎత్తేయాలి. అత్యున్నత చికిత్స అందించాలి. వృద్దురాలైన ఆయన తల్లి, భార్యాబిడ్డల ఆవేదన తీర్చాలి.

తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి టిడిపిపై ఎదురుదాడి చేస్తున్నారు. ఏది జరిగినా టిడిపికి అంటగడ్తున్నారు. డాక్టర్ సుధాకర్ వెనుక టిడిపి హస్తం ఉందంటారు. కరోనా వైరస్ టిడిపినే తెచ్చింది అంటారు. కరోనా స్లీపర్ సెల్స్ టిడిపినే అంటారు. మద్యం దుకాణాల వద్ద గుంపులకు టిడిపినే కారణం అంటారు. వలస కార్మికులపై లాఠీ ఛార్జ్ మనమే చేయించాం అంటారు.

ప్రస్తుత కరోనా సంక్షోభంలో వైద్యులకు ప్రపంచం అంతా నీరాజనాలు పలుకుతుంటే, దేశం అంతా డాక్టర్లపై పూలు జల్లుతుంటే, మన రాష్ట్రంలో మాత్రం మాస్క్ లు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేసి, పిచ్చాడి ముద్రవేసి, నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టిన చరిత్ర వైసిపి ప్రభుత్వానిదే. వలస కార్మికులను లాఠీలతో కొట్టిస్తారు, మళ్లీ వాళ్లే మానవత్వం చూపాలి అంటారు,  ‘‘దయ్యాలు వేదాలు వల్లించడం’’ అంటే ఇదే.

ప్రజావేదిక కూల్చడంతో రాష్ట్రంలో విధ్వంసాలు ప్రారంభం. అమరావతిలో నేనుండే ఇంటిపైకి వరదలు వచ్చేలా చేశారు. టిడిపిపై అక్కసుతోనే అమరావతిని నాశనం చేశారు. పల్నాడు గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించారు, టిడిపి కార్యకర్తలపై దాడులు చేశారు, భూములు లాక్కున్నారు, ఊళ్ల నుంచి తరిమికొట్టారు, మాచర్ల వెళ్లిన బొండా ఉమా, బుద్దా వెంకన్న, అడ్వకేట్ కిషోర్ పై హత్యాయత్నం చేశారు, 

విశాఖ ఎయిర్ పోర్టులో నన్ను అడ్డుకున్నారు, తప్పుడు కేసులు పెట్టి డాక్టర్ కోడెలను బలి తీసుకున్నారు. ఇప్పుడీ దళిత డాక్టర్ సుధాకర్ ను ఈ పరిస్థితికి తెచ్చారు. బోటు ప్రమాద బాధితులకు న్యాయం చేయమన్న మాజీ ఎంపి హర్షకుమార్ ను 48రోజులు జైలుకు పంపారు. దళిత మహాసేన రాజేష్ పై తప్పుడు కేసులు పెట్టారు. ద్రవిడ యూనివర్సిటి వీసి సుధాకర్ పై దౌర్జన్యం చేసి రాజీనామా చేయించారు.

ప్రకాశం జిల్లా దుర్ఘటనలో మృతి చెందిన దళితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో వివక్షత చూపారు. చదువు చెప్పే ఉపాధ్యాయులను బ్రాందీ దుకాణాల వద్ద డ్యూటీలు వేసే హీన స్థితికి దిగజారారు. వైసిపి ప్రభుత్వ అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఒక సైకోలా జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. నన్ను చూసి ఎవరైనా భయపడాలి, నాకు నచ్చినట్లు వ్యవహరిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అన్న పెడధోరణితో వ్యవహరిస్తున్నారు.

ఇలాంటి దుష్టబుద్దుల వల్లే జగన్మోహన్‌రెడ్డి తాత రాజారెడ్డిని సొంత గ్రామం నుంచి వెలివేస్తే, పులివెందుల చేరి అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. రాజారెడ్డి అడ్డదారిలోనే జగన్మోహన్‌రెడ్డి నడుస్తున్నాడు. ఫాక్షనిజం, కుట్రలు, దోపిడీలు, దుష్ప్రచారాలు జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. తమ అరాచకాలకు అడ్డొచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారు. చరిత్రలో బకాసురుడు, నరకాసురులను చూశాం. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వ్యక్తిని చూస్తున్నాం.

పేదల అసైన్డ్ భూములను ఇష్టారాజ్యంగా లాక్కున్నారు. ఇళ్ల పట్టాల ముసుగులో భారీ భూకుంభకోణాలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యానికి 4వ మూలస్థంభమైన పత్రికలు, ప్రసార సాధనాలపై కూడా కక్ష సాధిస్తున్నారు. రాజశేఖర రెడ్డి తెచ్చిన జీవో నెం 938కి మరిన్ని కోరలు పెంచి మీడియా సంస్థలను, జర్నలిస్టులను బెదిరిస్తున్నారు.
 
సీఎం జగన్మోహన్ రెడ్డికి చట్టంపై గౌరవం లేదు, రాజ్యాంగంపై విశ్వాసం లేదు. తనకు నచ్చనివారిపై కక్ష సాధిస్తాడు. ఏ అరాచకానికైనా తెగించడానికి వెనుకాడడు. చట్టం ఎవరికైనా సమానమే. రాజ్యాంగం అందరికీ ఒకటే. చట్టాన్ని ఉల్లంఘిస్తే కాపాడేందుకే కోర్టులు ఉన్నాయి. వైసిపి అరాచకాలను అందరూ ధైర్యంగా ఎదుర్కోవాలి. 
 
కరోనా లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన పేదలకు సహాయక చర్యలు చేపట్టిన టిడిపి నాయకులు, కార్యకర్తలకు  అభినందనలు. 163 నియోజకవర్గాలలో 5,332 ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు జరిపారు. కూరగాయలు, కోడిగుడ్లు, నిత్యావసర వస్తువులు, మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. 1,153 ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబానికి రూ 10వేలు పంపిణీ చేయాలని, అన్నా కేంటిన్లు పునరుద్దరించాలని కోరుతూ ‘‘12గంటల నిరసన దీక్షల’’ ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

అక్రమ మద్యం అమ్మకాలు, నాటుసారా తయారీ, డాక్టర్ సుధాకర్ పై దాడి, వలస కార్మికులపై లాఠీ ఛార్జీని నిరసిస్తూ, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని, మడ అడవుల నరికివేత, ఆవ భూముల కుంభకోణం, వైసిపి ల్యాండ్ స్కామ్ లపై ధ్వజమెత్తారు. అటు నిరసన దీక్షలతో ప్రభుత్వంపై ఒత్తిడి, ఇటు పేదలకు సహాయక చర్యలు చేపట్టిన అందరినీ అభినందిస్తున్నాను.
 
కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యింది. లాక్ డౌన్ 2లో దేశంలో రోజుకు 14.3% కేసులు నమోదైతే, లాక్ డౌన్ 3లో రోజుకు 8.78% కేసులకు తగ్గాయి. కానీ మన రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ నిర్వాకాల వల్లే కరోనా కేసులు పెరిగాయి.  ట్రాక్టర్ల ర్యాలీలు, పూలు జల్లించుకోవడాలు, బహిరంగ సభలు, ప్రదర్శనలు జరిపి కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్లుగా మారారు. మద్యం దుకాణాల వద్ద గుంపులతో, చౌక డిపోల వద్ద గుంపులతో, స్థానిక ఎన్నికల్లో వైసిపికి ఓటేయాలనే ప్రచారంతో కార్యకర్తలను వెంటేసుకుని గుంపులుగా తిరిగి వైరస్ ను విస్తృతం చేశారు. 
 
బిల్డ్ ఏపి స్కీమ్ ను, సోల్డ్ ఏపి చేశారు. భవిష్యత్ తరాల ఆస్తులను తెగనమ్మడం అవివేకం. కారుచౌకగా బినామీలకు కట్టబెట్టడానికే ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు. సమాజంలో ఆర్ధిక వనరులు పెంచాలి. ఉన్న వనరులను ధ్వంసం చేయరాదు. ప్రభుత్వ భూముల అమ్మకాలను నిరసించాలి. ప్రజల ఆస్తులను కాపాడాలి. అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది, ఒక్క కాలువకు తట్ట మట్టి తీశారా, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా..? గతంలో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తెచ్చి రాయలసీమలో పంటలను కాపాడాం. 
 
ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీమ్ పూర్తి చేసింది టిడిపి ప్రభుత్వమే. ముచ్చుమర్రి నుంచి కెసి కెనాల్ కు, బనకచర్లకు నీరు వాడుకోవచ్చు. గండికోట ముంపు బాధితులకు రూ 490కోట్లు పరిహారం ఇచ్చాం. అప్పట్లో జలయజ్ఞంలో ముడుపుల కోసం మట్టి పనులు చేసి ప్రాజెక్టుల పనులు వదిలేశారు. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులను దగా చేశారు.

తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా తదితర ప్రాజెక్టులు అన్నింటికి నాంది పలికింది టిడిపి ప్రభుత్వమే. టిడిపి 5ఏళ్లలో 23 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసింది, 32లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం.  70% పోలవరం పనులు పూర్తయ్యాయని కేంద్రానికి ఇదే వైసిపి ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు అదేం కాదని చెప్పడం దివాలాకోరు రాజకీయమే..

‘‘కాళేశ్వరం చేయడానికి వీల్లేదు, అది జరిగితే 2రాష్ట్రాలు ఇండియా- పాకిస్తాన్ అవుతాయని’’  దీక్షలు చేసిన పెద్దమనిషి, అదే కాళేశ్వరం ప్రారంభానికి వెళ్లి టెంకాయ కొట్టివచ్చాడు. ఆయన (కెసిఆర్) ఉదారవాది, తెలంగాణ భూభాగంమీద నీళ్లు నడపడానికి ఒప్పుకున్నాడని పొగిడాడు. ఇద్దరం కలిసి రెండు ప్రాంతాలను అభివృద్ది చేస్తామని చెప్పాడు. ఇప్పుడు మళ్లీ ప్రజల దృష్టి మళ్లించడానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో టిడిపి సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా పార్టీ నేతలు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకులో కరోనాను డిపాజిట్ చేసిన మహిళ, ఎక్కడ?