Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కూళ్లు తెరిచినా పిల్లల్ని పంపం : భారత్‌లో 92 శాతం మంది తల్లితండ్రుల మాట (Video)

Advertiesment
children
, శనివారం, 16 మే 2020 (15:51 IST)
కరోనా వైరస్‌ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై మాత్రమే కాకుండా... వివిధ సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడా పడుతోంది, వారి నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

మామూలుగా అయితే పిల్లల కెరీర్‌పై అమితంగా దృష్టి కేంద్రీకరించే భారతీయ తల్లితండ్రులు... లాక్‌డౌన్‌ మొదలై 50 రోజులు గడిచినా వారిని పాఠశాలకు పంపించేందుకు ఏమీ తొందరపడటం లేదట. భారత్‌లో తల్లితండ్రుల నిర్ణయాలపై కరోనా వైరస్‌ ఏ విధంగా ప్రభావం చూపుతోందనే అంశంపై పేరెంట్‌సర్కిల్‌ అనే సంస్థ ఓ జాతీయ స్థాయి సర్వే నిర్వహించింది.

దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలకు చెందిన 12,000 మంది పాల్గొన్న ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలుగు చూశాయి.

లాక్‌డౌన్‌ అనంతరం స్కూళ్లు తెరిచిన వెంటనే పిల్లలను పంపేందుకు 92 శాతం తల్లితండ్రులు సుముఖంగా లేరట. ఇక 56 శాతం మంది తాము కనీసం ఒక నెల వేచిచూస్తామని, అనంతరం పరిస్థితిని బట్టి పంపేదీ లేనిదీ నిర్ణయించుకుంటామని అంటున్నారు.

కేవలం 8శాతం మంది మాత్రమే పాఠశాలలు తెరవగానే పంపుతామంటున్నారు. బడికి పంపేందుకు కొవిడ్‌-19 పూర్తి నియంత్రణలోకి వచ్చిందనే నమ్మకం కలగిన తర్వాతే బడికి పంపే ఆలోచన చేస్తామని వారు అంటున్నారు. 
 
పిల్లల పెరుగుదలలో స్నేహితుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ పిల్లలను వారి స్నేహితులతో ఆడుకోనీయాలా వద్దా అనే విషయంపై తల్లితండ్రులు తర్జన భర్జనలకు గురౌతున్నారు. ఈ విషయమై సగానికి పైగా పేరెంట్స్‌ వేచిచూసే ధోరణి అవలంబిస్తామని అన్నారు.

తమ పిల్లలను పార్కుల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోవటానికి పిల్లలను తీసుకెళ్తామని 35 శాతం మంది అంటున్నారు. అయితే సామాజిక దూరం పాటిస్తామంటేనే తమ పిల్లలను ఆరుబయట ఆటలకు అనుమతిస్తారట. కరోనానంతరం మొత్తం మీద క్రీడలు వెనుకంజలో ఉండగా, వ్యక్తిగత క్రీడలు మాత్రం ఆదరణకు నోచుకోవటం గమనార్హం. 
 
కనీసం ఆరునెలల పాటు ఆటల ముఖమే చూడమని 45 శాతం అనగా... 25 శాతం తల్లితండ్రులు మాత్రం లాక్‌డౌన్‌ అనంతరం వ్యక్తిగత క్రీడాంశాల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారట.
 
కొవిడ్‌-19 వ్యాప్తికి ముందు లాగానే సెలవులు గడిపేందుకు వివిధ ప్రదేశాలకు వెళ్లడానికి కేవలం 1 శాతం మందే సిద్దమంటున్నారు. అత్యధికంగా 57 శాతం మంది కొంత కాలం పాటు ప్రయాణాలు మంచివి కాదని అభిప్రాయపడ్డారు. కాగా, 30 శాతం తల్లితండ్రులు సెలవుల్లో ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు చేయకుండా... ఉద్యోగం కోల్పోవటం, జీతాలు తగ్గటం వంటి అత్యవసర పరిస్థతుల కోసం ఆ డబ్బును దాచిపెడతామని నిర్ణయించుకున్నారు.

సామాజిక దూరం నిబంధనలు ఎత్తివేసినా ఈ సంవత్సరమంతా పిల్లల పుట్టిన రోజు పండుగలు జరుపమని 64 శాతం మంది చెప్పారు. ఇక మాల్స్‌కు, సినిమాలకు వెళ్లడమనే ఆలోచనే చేయమంటున్నారు అత్యధికులు. అతితక్కువగా అంటే కేవలం ఒక్క శాతం మాత్రమే ఆయా చోట్లకు వెళ్తారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి లడ్డూల అమ్మకాలు ప్రారంభం