Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం అమ్మకాలు తగ్గితే ఆదాయం ఎలా పెరిగిందో?: కాంగ్రెస్

మద్యం అమ్మకాలు తగ్గితే ఆదాయం ఎలా పెరిగిందో?: కాంగ్రెస్
, బుధవారం, 6 అక్టోబరు 2021 (08:53 IST)
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ ఆదాయం ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ డిమాండ్ చేశారు. పనికిమాలిన పేర్లతో చీప్ లిక్కర్ విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యం షాపులను యధాతధంగా కొనసాగిస్తూ ప్రభుత్వం గాంధీ జయంతి రోజున నోటిఫికేషన్ పేరుతో ప్రజలకు నజరానా ఇచ్చిందని విమర్శించారు. ఆంధ్రరత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు ఉండేవని, మద్య నిషేధంలో భాగంగా చర్యలంటూ వైసీపీ ప్రభుత్వం మద్యం షాపులను సొంతంగా నడపాలనే నిర్ణయం తీసుకుని షాపుల సంఖ్యను 3,500కు కుదించి 2019 అక్టోబరు 1న ప్రభుత్వ ఈ మేరకు మద్యం షాపుల పాలసీని ప్రవేశపెట్టిందన్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి కరోనా వల్ల సంపూర్ణ లాక్డౌన్ విధించడంతో మద్యం షాపులు మూతపడ్డాయి.

43 రోజుల తర్వాత మద్యం షాపులను ప్రభుత్వం తెరిచిందని, షాపుల సంఖ్యను 2,934కు కుదించిందన్నారు. 4,500 ఉన్న మద్యం దుకాణాలను 2,934కు తగ్గించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలతో రాష్ట్రంలో బీరు అమ్మకాలు 70 శాతం, మద్యం అమ్మకాలు 40 శాతం తగ్గాయని ప్రభుత్వం చెబుతోందని, 2015-16 లో రూ. 12,746 కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం 2020-21 నాటికి రూ. 18,005 కోట్లకు పెరిగినది అన్నారు.

మొదటిదశ లాక్డౌన్ తర్వాత గతేడాది మే నెలలో వాటి సంఖ్యను 2,934కు తగ్గించారని, 2020 అక్టోబరు 1 నుంచి 2021 సెప్టెంబరు 30వ తేదీ వరకూ అమలైన విధానంలో అంతకుముందున్న 2,934 దుకాణాలను కొనసాగించారు తప్ప ఏమాత్రం కుదించలేదన్నారు. తాజాగా నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ప్రకటించిందని, ఈ సారీ దుకాణాల సంఖ్యను తగ్గించలేదని, గత సంవత్సరం నుంచి ఉన్న 2,934 దుకాణాల్నే రాబోయే ఏడాది పాటు కొనసాగించనున్నట్లు పేర్కొందన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతమున్న 2,934 మద్యం దుకాణాలన్నింటినీ మరో ఏడాది పాటు కొనసాగించనుందని,  ఏడాదిలో 20 వేల కోట్ల రాబడి రాబట్టాలన్నదే సర్కారు వారి లక్ష్యంగా కనిపిస్తోందని  విమర్శించారు. ఓ వైపు మద్యం దుకాణాలు తగ్గిస్తున్నామంటూ లెక్కల్లో చూపించి మరోవైపు వేరే రూపంలో దుకాణాల ఏర్పాటకు తెర లేపారనన్నారు.

ఏపీఎస్బీసీఎల్ ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా వాకిన్ స్టోర్స్ నిర్వహిస్తోందని, సాధారణ మద్యం దుకాణాల్లో రోజుకు సగటున రూ.2-2.50 లక్షల మద్యం అమ్ముడైతే, వాకిన్ స్టోర్ లో రూ.7-8 లక్షల మద్యం విక్రయిస్తున్నారని, వీటిద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తోందన్నారు.

పెద్దగా వ్యాపారం జరగని, రద్దీ ప్రాంతాల్లో లేని సాధారణ మద్యం దుకాణాల్ని తొలగించి వాటి స్థానంలో రద్దీ, ఖరీదైన ప్రాంతాల్లో వాకిన్ స్టోర్స్ ఏర్పాటుకు వీలుగా వీటిని తెరపైకి తెచ్చారని, సంస్థకు అనుమతిచ్చిందని, మద్య నిషేధంపై జగన్ సర్కారు మాట తప్పింది, మడమ తిప్పేసింది అని ఎద్దేవా చేశారు. మూడు దశల్లో సంపూర్ణ మద్యనిషేధమన్న ఎన్నికల హామీని పక్కన పెట్టేసిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ‘హడావుడి’ చేసినా ఆ తర్వాత ఆ విషయం మరిచిపోయిందన్నారు. 

మద్యం అమ్మకాలు తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నామంటూ రెండేళ్లుగా ఊకదంపుడు ప్రచారం చేసుకున్న సర్కారు మరొక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతోందని, నూతన మద్యం పాలసీలో ఎలాంటి మార్పులు లేవని, ఇప్పుడున్న షాపులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసిందని, నూతన పాలసీని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. అంటే వరుసగా రెండేళ్లు మద్యనిషేధానికి ఒక్క చర్య కూడా తీసుకోలేదని స్పష్టమవుతోందని అన్నారు.

ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అని వైసీపీ హామీ ఇచ్చినా మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్నారన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా భారీగా వచ్చే ఆదాయం కావడంతో నిషేధానికి చర్యలు తీసుకోలేదని, మద్యమే ప్రధాన ఆదాయ వనరు కావడం, ప్రతినెలా సుమారు రూ.2 వేల కోట్లు వస్తుండటంతో దాన్ని వదులు కునేందుకు ఇప్పుడు జగన్ సర్కారు సుముఖంగా లేదని, గతేడాది ఆదాయం రూ.18 వేల కోట్లు దాటగా ఈ ఏడాది రూ.20 వేల కోట్లకు పైగా సమకూరుతుందని అంచనా వేస్తోందన్నారు.

నిజంగా సంపూర్ణ మద్య నిషేధం చేయాలని ఉంటే ప్రభుత్వం వీలైనన్ని మార్గాల్లో చర్యలు తీసుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపు 'వైఎస్‌ఆర్‌ ఆసరా' .. వరసగా రెండో ఏడాది