ఈనెల 10న జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికల తంతు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా పడింది. హైదరాబాద్‌లోని `మా` బిల్డింగ్ గురించి, ఇక్కడే వుంటున్న నటీనటుల సంఘం గురించి పోటీపోటీగా కొందరు విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎ.పి. మంత్రి పేర్ని నాని కూడా రంగంలోకి దిగి `మా` ఎన్నికలపై సోమవారంనాడు ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు.
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ, అక్టోబరు 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (జరిగే ఎన్నికలకు ప్రభుత్వానికి, జగన్మోహనరెడ్డికి ఏ మాత్రం ఆసక్తి,, ఉత్సాహం లేదని ఈ మేరకు తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
అసలు మంత్రి రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడానికి కారణం ఏమిటని ఆరాతీస్తే, మంచు విష్ణు వెనుక జగన్ వున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిన్ననే ఓ ప్రముఖ ఛానల్‌కు మోహన్‌బాబు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో. మీరు వై.ఎస్. జగన్‌కు బంధువు, చుట్టరికాలు వున్నాయి కదా. `మా` ఎన్నికలలో రచ్చ ఏమిటని? అదేవిధంగా ఆన్‌లైన్ టికెట్‌పై కూడా జగన్‌గారిని మీరే అడగవచ్చుగదా? అని ప్రశ్నవేయగా అందుకు మోహన్‌బాబు తగువిధంగా స్పందించారు. కట్‌చేస్తే, మరుసటిరోజే అనగా సోమవారం పేర్ని నాని క్లారిటీ ఇవ్వాల్సివచ్చింది.