అమరావతి : అఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్‌లో జర్నలిస్టులకు మరింత వెసులుబాటు కల్పిస్తూ సమాచార పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో సంబంధిత అధికారులతో ఈరోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 365, 430, 720, 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకోవచ్చని మంత్రి కాలవ ప్రకటించారు.
ఇళ్ల నిర్మాణం కోసం ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు, ఆయా జిల్లాల డీపీఆర్వోలకు దరఖాస్తు కాపీ అందించాల్సి ఉంటుంది. రాజధాని, ఢిల్లీలో పనిచేసే విలేకరులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తరవాత, వారు సమాచార కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. అన్ని వివరాలను ఇప్పటికే సమాచార శాఖ జేడీలు, డీడీలు, డీపీఆర్వోలకు పంపించారు.
ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు ముందుగా ఎఫ్‌ఏక్యూ చూసుకుని అప్లికేషన్ అప్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ ఓఎస్డీ సత్యనారాయణ, సమాచార శాఖ జేడీ పి. కిరణ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.