వ్యభిచారం కూపంలోకి నెడుతున్న మహిళల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, ఏపీలో మహిళలు అత్యంత పేదరికంలో బాధపడుతున్నారని, పేదరికంతో వారు పడుతున్న బాధలు, అనుభవిస్తున్న పరిణామాలను చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టు చెప్పారు.
ముఖ్యంగా, ఏపీలోని మహిళలు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్నారని చెప్పారు. ఈ సంఖ్యలో ఏపీ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. వ్యభిచారం కారణంగా బాలికలు యుక్త వయసులోనే గర్భవతులు అవుతుండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు.
ఇలాంటి విషయాలపై పోలీసులు ఏమాత్రం దృష్టిసారించడం లేదని, ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈ సోదరీమణులకు తగిన భద్రత, గౌరవప్రదమైన జీవితాలను అందించడంలో సైకో జగన్ బూటకపు సంక్షేమం విఫలమైందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
రాష్ట్రంలో 15 నుంచి 19 మధ్య వయసున్న యువతులు గర్భందాలుస్తున్న వివరాలతో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించిన వివరాలను లోకేశ్ షేర్ చేశారు. ఈ జాబితాలో ఏపీలో 12.6 శాతం మంది టీనేజ్ యువతులు గర్భం దాలుస్తున్నట్టుగా ఉంది. జాతీయ సరాసరి శాతం 6.8 శాతంగా ఉంది.
మన దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్న వ్యభిచారం వివరాలను కూడా లోకేశ్ పంచుకున్నారు. భారత్‌లో 8.50 లక్షల మంది వ్యభిచార వృత్తిలో ఉండగా... ఏపీ నుంచే 1,33,447 మంది మహిళలు వ్యభిచారం చేస్తున్నారు. ఈ జాబితాలో కర్ణాటక, తెలంగాణ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.