ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై ఉన్నాయని తెలిపింది. వర్షాల కారణంగా ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.
ప్రకాశం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 72 మిమీ వర్షవాతం నమోదుకాగా, అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో భారీ వర్షాలకు ద్రాక్ష, టొమాటో పంటలు దెబ్బతిన్నాయి.
ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో పిడుగుపాటుకు మిరపనాట్లు వేస్తున్న మహంకాళి చంద్రశేఖర్ (42) అనే కూలీ చనిపోయాడు. మరొకరు గాయపడ్డారు.
అలాగే ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యవంలో పొలం పనికి వెళ్లిన వి.ఆంజనేయులు (60), దర్శి మండలంలోని ఉయ్యాలవాడలో నాదెండ్ల రాణెమ్మ (35), శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం కేదారిపురం వద్ద పరహాలగెడ్డలో పడి పాడి శంకర్ రావు (27)లు మృత్యువాతపడ్డారు. ఇదిలావుంటే, మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని, అదువల్ల జాలర్లతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.