Publish Date: Sat, 30 Aug 2025 (10:07 IST)
Updated Date: Sat, 30 Aug 2025 (10:11 IST)
నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది వరద ఉద్ధృతి కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వరదనీరు బాసరను ముంచేసింది. బాసర ఆలయ పరిసర ప్రాంతాలను, పుష్కర ఘాట్ల వద్ద వరద నీరు చేరింది. ఆలయానికి వెళ్ళే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. మూడు లాడ్జ్‌లు, ఒక ప్రైవేట్ అతిథి గృహం వరద నీటిలో చిక్కుకున్నాయి. తొమ్మిది కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుని బాధపడుతుండగా, పోలీసులు, స్థానికులు వారికి ఆహార సహాయం అందిస్తున్నారు.
బాసర వద్ద గోదావరి 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఉప్పొంగింది. 1984లో భారీ స్థాయిలో వచ్చిన వరద కారణంగా పుష్కర ఘాట్లు మునిగి నీరంతా రోడ్డుపైకి చేరింది. మరోసారి ప్రస్తుతం గోదావరి పోటెత్తడంతో వరద గంగమ్మ విగ్రహం, శివాలయం దాటి శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలోకి చేరింది. దీంతో అప్రమత్తమైన ఆఫీసర్లు ఆలయం నుంచి గోదావరి నది వైపు వెళ్లే మార్గాన్ని మూసేశారు. గోదారమ్మ శాంతించాలంటూ ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి, సౌభాగ్య ద్రవ్య సమర్పణ చేశారు.