తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు జరుగుతున్నాయి. అలాగే, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు బోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన చెన్నైలోని తన కుమార్తె ఇంటికి వచ్చి, మంగళవారం వేకువజామునే లేచి భోగి మంటలు వేశారు. ఆ తర్వాత భోగి నీళ్లతో తలస్నానం చేశారు. అలా దేశ రెండో పౌరుడుగా ఉన్న వెంకయ్య తన కుటుంబంతో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు.
ఇకపోతే, తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వెలిశాయి. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల ముందు భారీగా భోగి మంటలు వేశారు. ప్రజలు భోగి మంటలు వెలిగించి సంక్రాంతి పర్వదినానికి స్వాగతం పలికారు. భోగి మంటలు చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా ప్రజలు పండుగను జరుపుకుంటున్నారు.