ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. దాంతోపాటే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలకు కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన తన రాజీనామా లేఖను పంపించారు.
మరోవైపు, ఫైబర్ నెట్‌లో వైకాపాకు చెందిన 500 మందికి పైగా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చినట్టు గుర్తించిన జీవీ రెడ్డిపై వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఫైబర్ నెట్ ఎండీతో ఉన్నతాధికారులను నిలదీశారు. పైగా, ఫైబర్ నెట్‌లో గత వైకాపా ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను బహిర్గతం చేయడంతో పాటు అవినీతికి అండగా నిలబడిన ఐఏఎస్ అధికారులపై రాజద్రోహం కేసు పెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు పెనువివాదానికి దారితీశాయి. అలాగే ఫైబర్ నెట్ ఎండీ దినేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దినేశ్ కుమార్‌ను సాధారణ పరిపాలన శాఖకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ రెండు చర్యల ద్వారా అటు పార్టీలో అయినా ఇటు ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకు ప్రాధాన్యం అనే బలమైన సంకేతాలను పంపించినట్టయింది.