సాధారణంగా జర్నలిస్టులంటే, అంతా పైకి గౌరవించినా లోలోన మాత్రం వారిపై గుర్రు పెంచుకుంటారు. చాలా చోట్ల జర్నలిస్టులు ఎన్నికల్లో నిలబడితే, ఓడిపోయిన సందర్భాలే అత్యధికం. కానీ దీనికి భిన్నంగా తన ప్రజాదరణను నిరూపించుకున్నారు... షేక్ బడేజానీ, అలీమున్నిసా బేగం దంపతులు. ఇద్దరూ ఒకేసారి కౌన్సిలర్లుగా ఎన్నికై, తమ సత్తాని నిరూపించుకున్నారు.
గత మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో కొనసాగుతూ, పల్నాడు ప్రాంతంలో ప్రముఖ జర్నలిస్టుగా, స్వచ్ఛంద సేవకుడిగా, ప్రజా సమస్యలపై నిత్యం స్పందించే ఉద్యమకారుడిగా పేరొందిన షేక్ బడే జానీ, ఆయన సతీమణి అలీమున్నిసా బేగం గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజా సమస్యలే ఎజెండాగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఇద్దరు ఒకేసారి కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఈ శుభ సందర్భంగా జర్నలిస్టు సంఘాలు, ప్రజా సేవకులు బడే జానీ దంపతులకు అభినందనలు తెలియజేశారు.
గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో త్వరలో చైర్మన్ బాధ్యతలు కూడా బడే జానీ స్వీకరించబోతున్నారని స్థానిక రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. బడే జానీ దంపతుల విజయంపై సీనియర్ జర్నలిస్టులు, ఏపీ బీజేఏ నాయకులు పఠాన్ మీరా హుస్సేన్ ఖాన్, శ్రీనివాసాచారి, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, సీనియర్ మీడియా ఇన్ ఛార్జి ఎస్.ఐ. షఫీ తదితరులు అభినందనలు తెలిపారు.