Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గీత దాటితే వేటేనంటున్న గుంటూరు రేంజ్ ఐజీ

webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (11:08 IST)
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కొరడా ఝుళిపిస్తామని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్ హెచ్చరించారు. అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించని వారిని ఉపేక్షించ వద్దని పోలీస్‌ అధికారులకు డీజీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి పాల్పడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బంది తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. 
 
గత ప్రభుత్వ హయాంలో పోలీస్‌ శాఖలో పనిచేసిన కొందరు అధికారులపై అవినీతి ఆరోపణలు, ఇతర ఫిర్యాదులు వచ్చిన వారిపై కఠినమైన చర్యలు తీసుకున్న ఘటనలు మచ్చుకైనా లేవు. అవినీతి ఆరోపణలు, ఇతర ఫిర్యాదులు ఎదుర్కొన్న వారిని గత ప్రభుత్వ హయాంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వెనకేసుకొస్తూ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాపాడుతూ వచ్చారు.
 
ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నంగా పనిచేస్తుంది. అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షింబోమని స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నీతివంతమైన పాలన అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతికి తావు లేకుండా నీతివంతమైన పాలన సాగించాలని అన్ని శాఖలకు సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్‌ శాఖల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించి పారదర్శకత పాటించాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. పోలీస్‌ శాఖ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయా జిల్లాల పోలీస్‌ బాస్‌లు, రేంజ్‌ ఐజీలకు డీజీపీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 
 
సీఐలపై విచారణ 
సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్నికల అనంతరం జిల్లాలో పలువురు సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలపై పోలీస్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. సీఐలపై వచ్చిన ఫిర్యాదులపై ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ డీఎస్పీతో విచారణకు ఆదేశించారు. 
 
జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలు, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక సీఐపై ప్రస్తుతం విచారణ నడుస్తోంది. జిల్లాకు చెందిన సీఐలపై జరుగుతున్న విచారణను రూరల్‌ జిల్లా ఎస్పీ జయలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సైలు, ఏఎస్సైలపై సైతం విచారణలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. విచారణలో సిబ్బంది తప్పు చేసినట్టు రుజువైతే శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. ఇటీవల రూరల్‌ జిల్లాలో పలువురు ఎస్సైలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వారిపై రూరల్‌ జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. 
 
అర్బన్‌ పరిధిలో ఇటీవల మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ రమేశ్‌ మహిళపట్ల అసభ్యంగా వ్యవహరించిన ఘటనలో ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ నిష్పక్షపాతంగా వ్యవహరించి నివేదికపంపగా సస్పెండ్‌ చేశారు. గుంటూరులోని కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డు పక్కన సెల్‌ఫోన్‌ గొరిల్లా గ్లాసులు విక్రయించే వ్యాపారిపట్ల ఓ కానిస్టేబుల్‌ మద్యం తాగి అతిగా ప్రవర్తించిన ఏఆర్‌ కానిస్టేబుల్‌పై సైతం చర్యలు తీసుకున్నారు. 
 
ఇదే తరహాలో నరసరావుపేటలో ఓవర్‌ యాక్షన్‌ చేసి అర్థరాత్రి వేళలో మద్యం తాగేందుకు అనుమతివ్వలేదనే కారణంగా బార్‌ యజమానిపై దాడికి పాల్పడిన నలుగురు కానిస్టేబుళ్లపై రూరల్‌ ఎస్పీ వేటు వేశారు. అదేతరహాలో నరసరావుపేట టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ రెండో వివాహం చేసుకున్నట్లు విచారణలో తేలడంతో అతనిపై కూడా సస్పెండ్‌ వేటు వేశారు.
 
బాధ్యతగా పనిచేయాలి 
గుంటూరు రేంజ్‌ రాష్ట్రంలోనే ప్రత్యేకమైంది. రేంజ్‌ పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది క్రమశిక్షణకు మారుపేరుగా పనిచేయాలి. బాధ్యతగా వ్యవహరిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలవాలి. అవినీతి, ఆరోపణలపై ఫిర్యాదులు అందితే విచారణ జరిపి వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదు.  ఇప్పటికే కొందరు అధికారులపై విచారణ కొనసాగుతోంది. విచారణ అనంతరం వాస్తవమని తేలితే చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

చంద్రబాబుకు ఏమైంది?... అమెరికాలో వైద్య పరీక్షలు