Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సనాతన ధార్మిక పరీక్షల విజేతలకు బంగారు ప‌త‌కాలు... టిటిడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి

సనాతన ధార్మిక పరీక్షల విజేతలకు బంగారు ప‌త‌కాలు... టిటిడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి
, శనివారం, 27 జులై 2019 (20:49 IST)
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 37వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో బంగారు, వెండి  పథకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు  టిటిడి ధర్మకర్తలమండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో శనివారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యవర్గ సమావేశం జరిగింది. 
 ఈ సంద‌ర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ.. గతంలో సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రం, నగదు బహుమతి ఇచ్చేవారని, ఇకపై బంగారు, వెండి పత‌కాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి ప్రథమ బహుమతికి 5 గ్రాముల బంగారు పత‌కం, ద్వితీయ బహుమతికి 2 గ్రాముల బంగారు పత‌కం, తృతీయ బహుమతికి 1 గ్రాము బంగారు పత‌కం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

అదేవిధంగా జిల్లాలో స్థాయిలో ప్రథమ బహుమతికి 1 గ్రాము బంగారు పత‌కం, ద్వితీయ బహుమతికి 10 గ్రాముల వెండి పత‌కం, తృతీయ బహుమతికి 5 గ్రాముల వెండి పత‌కం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాక 6,7,8 తరగతుల విద్యార్థులకు ధర్మపరిచయం పరీక్షలు నిర్వహించేవారని, వీటితోపాటు ఇకపై 9,10 తరగతుల విద్యార్థులకు ధర్మప్రవేశిక పరీక్షలు నిర్వహిస్తారన్నారు. 

2019 - 20 సంవత్సరానికి హిందూ ధార్మిక ప్రచార పరిషత్, శ్రీ కంచి కామకోటి పీఠం సంయుక్తంగా చిత్తూరు జిల్లాలోని 16 మండలాలలో పైలెట్ ప్రాజెక్ట్ గా మూడు రోజుల పాటు వేద పారాయణం, హోమం, గోపూజ, తులసిపూజ, వృక్ష పూజ తదితర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. హెచ్‌డిపిపి ఆధ్వర్యంలో జరుగుతున్న సప్తాహం (7రోజులు)  కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఏపీ, తెలంగాణ భజన మండళ్ల కళాకారులకు కిలో మీటరుకు 62 పైసలు చొప్పున సాధారణ బస్సు ఛార్జీలు చెల్లించేందుకు అంగీకరించామని పేర్కొన్నారు.

అదేవిధంగా హెచ్‌డిపిపి ఆధ్వర్యంలో మనగుడి, అర్చక శిక్షణ, శ్రీవేంకటేశ్వర ధర్మ రథయాత్ర, శుభప్రధం, సనాతన ధార్మిక విజ్జాన పరీక్షలు, సదాచారం, గీతా జయంతి, భక్తులకు పుస్తక ప్రసాదం, అఖండ హరినామ సంకీర్తన  తదితర  కార్యక్రమాల ద్వారా మరింత విస్తృతంగా ధర్మప్రచారం చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అనంతరం ఎస్వీబీసీ బోర్డు కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఎస్వీబీసీ బోర్డు ఛైర్మెన్‌గా నియమితులైన పృథ్వీరాజ్ మర్యాదపూర్వకంగా టిటిడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డిని కలిశారు.

కార్యవర్గ సమావేశంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో  పి.బసంత్‌కుమార్, దేవాదాయ కమీషనర్ డాక్ట‌ర్ పద్మ, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ర‌మ‌ణ‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబర్ 2 నుండి వార్డు, గ్రామ సచివాలయాలు... 4 లక్షల వెయ్యి మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం