ఈ ఏడాది అక్టోబర్ 2 నుండి వార్డు, గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతాయని, వార్డు, గ్రామ సచివాలయాలలో కార్యదర్శుల నియామకం కోసం నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
విజయవాడలోని సిఆర్డిఎ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... రాష్ట్రంలోని పట్టణాలలో ప్రతి 3 నుండి 4 వేల జనాభాకు ఒక వార్డు సచివాలయం ఉంటుందని, ఇలాంటి 3,786 వార్డు సచివాలయాలలో 37,860 వార్డు సెక్రటరీ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీచేశామన్నారు. ఒక్కో వార్డు సచివాలయంలో 10 మంది కార్యదర్శులు ఉంటారన్నారు. వీరిని శాశ్వత ఉద్యోగులుగా నియామకం చేస్తామన్నారు. అలాగే గ్రామాలలో కూడా 11,157 గ్రామ సచివాలయాల కార్యదర్శుల నియామకానికి కూడా ఉత్తర్వులు ఇచ్చామన్నారు.
ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే వారిని 5 వేల వేతనంతో గ్రామ వాలంటీర్లుగా నియమించడం జరుగుతుందని, మంచి ఉద్యోగాలు వచ్చే వరకు వాలంటీర్లుగా పనిచేయవచ్చన్నారు. ఎన్నికలలో చేసిన వాగ్దానం మేరకు పరిపాలన ప్రజల ముంగిట్లో ఉండాలనే ఆలోచనతో వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా నేరుగా సేవలు ప్రజల ఇంటికి చేర్చే విధంగా జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీని వల్ల రాష్ట్రంలో 4,01,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుందని దీనిని రాష్ట్రంలోని నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
రాజకీయ పార్టీలు ఎన్నికలలో వాగ్దానాలు చేయడం సహజమని, అయితే కొంత మంది ఎన్నికలైన తరువాత వాటిని పక్కన పెట్టేస్తారన్నారు. గత ప్రభుత్వం 2014 ఎన్నికల ముందు 600 వాగ్దానాలు చేసి కనీసం 6 అయినా అమలు చేయకుండా అనైతిక పరిపాలన చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన 60 రోజుల లోపే ఎన్నికలలో చేసిన వాగ్దానాలు నవరత్నాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రతి వార్డు సచివాలయంలో 10 మంది కార్యదర్శులు ఉంటారని, వారిలో ఒకరు ఎడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ఉండి ఆయన ఆధ్వర్యంలో మిగిలిన 9 మంది కార్యదర్శులు ప్రజలకు సేవలు అందిస్తారన్నారు.
"అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మిగిలిన 9 మంది సెక్రటరీలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల నుండి అందే ఫిర్యాదులను పరిష్కరించడం, రెవెన్యూ కలెక్షన్లు, ప్రజా స్పందన అందించడం వంటి విధులు నిర్వహిస్తారు. ఎమినిటీస్ సెక్రటరీ ప్రజలకు సదుపాయాలు కల్పించడం మంచినీరు, రోడ్లు, డ్రైన్లు, కల్వర్లు తదితర మౌలిక సదుపాయల అంశాలను నిర్వహిస్తారు. శానిటేషన్ సెక్రటరీ ఆ వార్డులోని పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించిన విధులు నిర్వహిస్తారు.
ఎడ్యుకేషన్ సెక్రటరీ విధుల్లో అమ్మఒడి పథకం అమలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆ వార్డుకు సంబంధించిన డ్రాప్ అవుట్స్, తల్లిదండ్రులతో సమన్వయం తదితర గణాంకాలతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు సరిగా అందే విధంగా చూస్తారు. ప్లానింగ్ సెక్రటరీ టౌన్ ప్లానింగ్ వ్యవహారాలతో పాటు గృహనిర్మాణ పథకాల అమలు, ఆ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమాలు, మంచినీటిని పొదుపుగా వినియోగించడం తదితర అంశాలకు సంబంధించిన విధులు నిర్వహిస్తారు.
వార్డు వెల్ఫేర్ సెక్రటరీ నిర్వహించే విధుల్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిరటీ, బిసీ మహిళా, యువత తదితర వర్గాలకు ప్రభుత్వ పథకాల అమలు మరియు నిర్వహణ, వై.యస్.ఆర్ చేయుత, వై.యస్.ఆర్ ఆసరా, వై.యస్.ఆర్ ఫించన్లు, పట్టణ పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాల విధులు నిర్వహిస్తారు. హెల్త్ సెక్రటరీ (వైద్య ఆరోగ్య శాఖ) కు సంబంధించిన పబ్లిక్ హెల్త్, వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ, వై.యస్.ఆర్ బీమా, అంగన్ వాడీ తదితర విధులను నిర్వహిస్తారు. రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ విభాగానికి సంబంధించిన నిత్యావసర వస్తువులు, భూపరిపాలనా వ్యవహారాలు నిర్వహిస్తారు.
మహిళా సెక్రటరీ ఆ వార్డులోని శాంతి భద్రతలు, మద్య నిషేదం, బెల్టషాపులు లేకుండా చూడటం, మహిళలు, బలహీనవర్గాలపై దాడుల నుండి రక్షణ కల్పించడం వంటి విధులు నిర్వహిస్తారని ఎనర్జీ సెక్రటరీ వార్డులో విద్యుత్ సరఫరా, రైతులకు ఉచిత విద్యుత్ పధకం, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తదితర విధులు నిర్వహిస్తా "రని మంత్రి తెలిపారు.