Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంద్రకీలాద్రిపై నవరాత్రులకు ఘనంగా ఏర్పాట్లు

Advertiesment
Great arrangements
, శనివారం, 28 సెప్టెంబరు 2019 (07:50 IST)
దసరా వేడుకలు దగ్గరపడుతుండటంతో ఇంద్రకీలాద్రి ఉత్సవ శోభను సంతరించుకుంటోంది. ఈనెల 29 నుంచి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి సన్నిధిలో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్షలాదిగా తరలిరానున్న భక్తులు క్రమపద్ధతిలో అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి.

గత ఏడాది మూలానక్షత్రం రోజున మూడున్నర లక్షల మంది భక్తులు వచ్చారు. విజయదశమి రోజు అంతకన్నా ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఏడాది మూలానక్షత్రం ఆదివారం రావడంతో ఈ ఏడాది భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా వేసి.. అందుకనుగుణంగా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
దసరా ఉత్సవాలు ప్రారంభం కావడానికి ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అమ్మవారి ప్రధాన ఆలయం, మల్లేశ్వరస్వామి ఆలయం, మల్లిఖార్జున మహామండం, రాజగోపురం, ఇంద్రకాలాద్రి కొండపైన, దిగువన ఉన్న పరిసరాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్త్తున్నారు. ఆ విద్యుత్తు దీపాలను ట్రయల్‌ రన్‌గా వెలిగిస్తుండటంతో ఇంద్రకీలాద్రి రాత్రిపూట సరికొత్త కాంతులీనుతోంది.

 
లైటింగ్‌ ఏర్పాట్లు, పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం మైకులు, సౌండ్‌సిస్టమ్‌, భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు తదితర పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దుర్గా ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల వల్ల అవరోధాలు ఎదురవుతున్నా క్యూలైన్ల నిర్మాణ పనులను ఒక కొలిక్కి తీసుకురాగలిగారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా క్యూలైన్‌ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి.

దుర్గా ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో దుర్గాఘాట్‌ ముందు క్యూలైన్ల నిర్మాణ పనులకు అవరోధాలు ఎదురవుతున్నాయి. కొండ దిగువన క్యూలైన్ల నిర్మాణం అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదు. భక్తులు ప్రసాదాలు స్వీకరించేందుకు కనకదుర్గానగర్‌లోని ఖాళీ స్థలంలో భారీ షెడ్డు నిర్మించి, 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

భవానీ మాల ధరించిన భక్తులు ఇరుముడు విప్పి దీక్ష విరమించేందుకు వీలుగా శివాలయం మెట్ల దిగువన కుడివైపు షెడ్డు వేసి ఏర్పాట్లు చేశారు. మల్లికార్జున మహామండపం ఎదురుగా హోమగుండం నిర్మించారు. దసరా ఉత్సవాలకు లక్షలాదిగా తరలిరానున్న భక్తులకు స్వాగతం పలుకుతూ ఘాట్‌రోడ్డు ప్రారంభంలో టోల్‌గేట్‌ వద్ద, కెనాల్‌రోడ్డులో వినాయకుని గుడి దగ్గర, అటు రాజీవ్‌గాంధీ పార్కు సమీపంలోను ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ స్వాగత ద్వారాలను ఏర్పాటు చేసింది.

దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల రద్దీ ఎక్కువగా పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌, పద్మావతిఘాట్‌, దోబీఘాట్‌, సీతమ్మవారిపాదాలు, దుర్గాఘాట్‌ల దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా ఎక్కడికక్కడ మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు.

కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసే ఘాట్‌లలో జల్లుస్నానాలకు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గా ఫైఓవర్‌ వంతెన పనుల కారణంగా స్థలాభావం ఏర్పడటంతో కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలోని రెండు అండర్‌పాస్‌ల మధ్య నున్న స్థలంలో కేశఖండనశాల షెడ్డు నిర్మాణ పనులను గురువారం నుంచి మొదలు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో ఊరట