Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోదావరికి మళ్లీ భారీ వరద

webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (20:19 IST)
గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. దీంతో 16 మండలాలకు ముప్పు ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు... గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

భద్రాచలం వద్ద మూడ్రోజులుగా రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ఉరకలెత్తుతున్న గోదావరి ధాటికి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తూర్పుగోదావరిలోని విలీన మండలాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. దేవీపట్నం సహా మన్యం ప్రాంతాలు నీటిలోనే ఉండగా... కోనసీమలోని లంకవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గోదావరి ఉగ్రరూపం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పీకల్లోతు కష్టాలు తెచ్చిపెట్టింది. దేవీపట్నం మండలంలోని పరిసరాల గ్రామాలు.. అష్టకష్టాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నెల తిరగకుండా మరోసారి వరదపోటు రావటంతో 30 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. అందులో 9గ్రామాలను గోదారి ప్రవాహం ముంచెత్తింది.

తొయ్యేరు, దేవీపట్నం, వీరవరం, పూడిపల్లి, పోశమ్మగండి వద్ద ప్రభుత్వం సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినా.. సరైన సౌకర్యాలు లేవని బాధితులు చెబుతున్నారు. ఇళ్లు, సామాగ్రిని వదలి అక్కడకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు.

మారుమూల ఉండే తమకు ఎలాంటి సౌకర్యాలు అందటం లేదని.. మహిళలు వాపోతున్నారు. కనీసం తనకు పడవలు ఇచ్చేందుకు అధికారులు ఆసక్తి చూపటం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమకు ఆర్ &ఆర్ ప్యాకేజీ ఇస్తే.. ఇక్కడ నుంచి వెళ్లిపోతామని చెబుతున్నారు. కోనసీమలోని లంకగ్రామాల పరిస్థితీ ఇలాగే ఉంది. వైనతేయ, వశిష్ట, గౌతమి పాయలు నిండుగా ప్రవహిస్తున్నాయి.

కోనసీమలోని 16 మండలాలు వరదగుప్పెట్లో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో కాజ్‌వేలు నీటమునిగాయి. రాకపోకలకు ప్రజలు అగచాట్లు పడుతున్నారు. ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంక ఆఫ్‌ ఠానేలంక, శేరుల్లంక, సలాదివారిపాలెం, కమిని వంటి లంకప్రాంతాల ప్రజలు.. ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

నెల క్రితం వచ్చిన వరద నుంచి కోలుకునే లోపే..మరోసారి ప్రకృతి విపత్తు సంభవించిందంటూ ఆవేదన చెందుతున్నారు. మిరప, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగి... రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ వరదప్రవాహం ఎక్కువగానే ఉంది.

బాలయోగినగర్, కోన వెంకటరత్నం నగర్ నీట మునిగింది. తీరం వెంబడి మత్స్యకారులు నిర్మించుకున్న నివాసాలు ముంపునకు గురయ్యాయి. పర్యాటక ప్రదేశాలైన రాజీవ్ బీచ్, భరతమాత విగ్రహం నీటమునిగాయి.
 
నాగార్జున సాగర్​ 14 గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. జలాశయం 14 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణ నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్​కు వరద కొనసాగుతోంది.

ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2 లక్షల 75 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 14 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. మొత్తం సాగర్ నుంచి ఔట్ ఫ్లో లక్ష 20 వేల క్యూసెక్కులుగా ఉంది.

జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.20 అడుగులు మేర నీరు నిల్వ ఉంది. సాగర్ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.20 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జున సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువలకు సాగు నీటి విడుదల కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత పులిచింతల ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.

పులిచింతల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,06,055 క్యూసెక్కులు... ఔట్‌ఫ్లో 1,31,960 క్యూసెక్కులు గా ఉంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలు.. ప్రస్తుత నీటి నిల్వ 44.08 టీఎంసీలు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 175 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 173.91 అడుగులు కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

తపాలా ద్వారా స్మార్ట్ కార్డులు పంపిణి