వినాయక చవితి ఉత్సవాలను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే.. దొంగలు మాత్రం తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు. మంచి టైమ్ చూసుకుని.. గణేష్ మండపంపై కన్నేసి వుంచుతున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో గణేష్ మండపంలో దొంగ లడ్డూ ఎత్తుకెళ్లాడు.
నంద్యాల టుటౌన్ సమీపంలో గణపతి మండపాన్ని ఏర్పాటు చేసి.. భారీ గణపతి ప్రతిమకు భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలను నిర్వహిస్తున్నారు. పూజలో భాగంగా నాయకుడి చేతిలో లడ్డుని కూడా ప్రసాదంగా పెట్టారు. ఈ లడ్డుని నవరాత్రుల అనంతరం.. వేలం పాటలో దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడతారు.
వేలంలో ఈ లడ్డూను దక్కించుకుంటే కుటుంబానికి సిరి సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.