వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రధాన రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తలపెట్టినకార్యాలు నిర్వఘ్నంగా కొనసాగేలా, సుఖశాంతులతో కూడిన జీవితం సాకారమయ్యేలా ఆ ఏకదంతుని దీవెనలు దేశ ప్రజలందరికీ అందించాలని పార్థిస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనల్లో పేర్కొన్నారు.
సకల శాస్త్రాలకు అధిపతి అయిన వినాయకుడు అని, బుద్ధి, జ్ఞానానికి ఆరాధ్యుడుగా ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడుగా హిందువుల భక్తిశ్రద్ధలతో గణేశుడిని ఆరాధిస్తారని వారు గుర్తుచేశారు.
అలాగే, గణేశ్ చతుర్థి జ్ఞానం, నైతిక విలువలు, లక్ష్య సాధన, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను మనకు నేర్పుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. వినాయక నవరాత్రులను ప్రజలు భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
అలాగే, వినాయక చవితి అందరూ కలిసిమెలసి జరుపుకునే పండుగ అని తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ అని జనసేన పార్టీ అధినే పవన్ కళ్యాణ్ అన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన ఆనందమయ వినాయకచవితి ఒకనాడు తెల్లవారిపై పోరాటానికి, హిందువుల సమైక్యతకు ఆలంబనగా నిలిచిందని గుర్తుచేశారు. ఈ పండుగకు కేవలం మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలని ఆయన మనవి చేశారు.
అదేవిధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఇరు రాష్ట్రాల ప్రజలు చవితి శుభాకాంక్షలు తెలిపారు. అయితే, గణేష్ ఉత్సవాలకు అనుమతుల పేరుతో ఆంక్షలు విధించరాదని ఆయన కోరారు. గణనాయకుని భక్తి శ్రద్ధలతో ఆరాధించే ప్రజలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ విఘ్నేశ్వరుడు మీ సంకల్పాలన్నింటినీ నెరవేర్చాలని మీ ఇంటిల్లిపాదికీ సుఖ సంతోషాలను ప్రసాదంచాలని కోరుకంటున్నట్టు తెలిపారు.