Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరదలు దెబ్బ తీసాయి, రూ.2250 కోట్లు ఆర్థిక సాయం అందించండి, తక్షణం రూ.1000 కోట్లు కావాలి: కేంద్రానికి సీఎం జగన్

Advertiesment
వరదలు దెబ్బ తీసాయి, రూ.2250 కోట్లు ఆర్థిక సాయం అందించండి, తక్షణం రూ.1000 కోట్లు కావాలి: కేంద్రానికి సీఎం జగన్
, శనివారం, 17 అక్టోబరు 2020 (22:44 IST)
భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని ఈ నేప‌ధ్యంలో ఆదుకునేందుకు వెంటనే రూ.2250 కోట్ల ఆర్థిక సహాయం చేయడంతో పాటు, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి శ‌నివారం లేఖ రాశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయి.
 
ఒక్క 13వ తేదీనే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 265.10 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అదే జిల్లాలోని కాట్రేనికోనలో 228.20 మి.మీ, తాళ్లరేవులో 200.50 మి.మీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 205.30 మి.మీ, పేరవల్లిలో 204.02 మి.మీ వర్షం కురిసింది. ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పొటెత్తింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా, పలు చోట్ల గత మూడు రోజులుగా తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు (సహాయ శిబిరాలకు) తరలించాం.
 
భారీ వర్షాలు, వరదలతో జనజీవ‌నం అస్తవ్యస్తమైంది. గత ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లోనూ భారీ వర్షాలు కురవడం, ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగింది. వరసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయి. పలు చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. విద్యుత్‌ ఉత్పత్తిపైనా వర్షాలు ప్రభావం చూపాయి. ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ కూడా నిల్చిపోయింది. ఈ వర్షాల వల్ల రైతులు కూడా చాలా నష్టపోయారు.
 
ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అదే విధంగా కూరగాయలు, అరటి, బొప్పాయి తోటలు కూడా దారుణంగా దెబ్బ తిన్నాయి. వరద సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్విరామంగా పని చేసినప్పటికీ, 14 మంది చనిపోయారు. వివిధ శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.4450 కోట్ల మేర నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉంది.
 
పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టి, తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకురావడం కోసం తక్షణమే ముందస్తుగా కనీసం రూ.1000 కోట్లు మంజూరు చేయాలి. అదే విధంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కోసం వెంటనే కేంద్ర బృందాన్ని పంపించాలి. ఇప్పటికే కోవిడ్‌–19తో ఆర్థికంగా నష్టపోయి ఉన్న రాష్ట్రంలో, ఇప్పుడు ఈ వర్షాలు, వరదలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు మీ అండ, చేయూత ఎంతో అవసరమని విజ్ఞప్తి చేస్తున్నాను అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆ లేఖలో కేంద్ర హోం మంత్రిని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్మాత అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి కొడాలి నాని ఆకాంక్ష‌