Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్మాత అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి కొడాలి నాని ఆకాంక్ష‌

జగన్మాత అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి కొడాలి నాని ఆకాంక్ష‌
, శనివారం, 17 అక్టోబరు 2020 (22:27 IST)
గుడివాడ‌: లోక కళ్యాణం కోసం అమ్మవారు రోజుకో అవతారాన్ని ధరించారని, దేవీ నవరాత్రుల్లో అమ్మవారి విశేష అలంకారాలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేద్దామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. హిందువుల ముఖ్యమైన దసరా పండుగను తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులుగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఈ సందర్భంగా పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవిని పూజిస్తుంటారన్నారు. 
 
నవరాత్రులను నవ అహోరాత్రులని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయన్నారు. తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేకమైన విధానం ఉందన్నారు. తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను నిష్టగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుందన్నారు. దేవీ అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోర్కెలు తప్పక నెరవేరతాయన్నారు. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవీ ఆరాధన చేయడం శుభకరమన్నారు.
 
నవరాత్రుల్లో రాహుకాల వేళ దీపాన్ని వెలిగించాలని, దీనివల్ల రాహు ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ కూడా జరుగుతుందన్నారు. జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10 వ రోజు ప్రజలంతా సంతోషంగా దసరా పండుగను జరుపుకుంటూ వస్తున్నారన్నారు. సాధారణంగా విజయదశమి రోజున ఏదైనా కొత్త విద్యలు నేర్చుకునే వారు వాటిని ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారన్నారు. అలాగే జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురాణాలు చెబుతున్నాయన్నారు.
 
శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉందని, విజయదశమి రోజున పూజలందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజ స్థలంలో, ధన స్థానంలోని నగదు పెట్టెల్లో ఉంచడం వల్ల ధనవృద్ధి జరుగుతుందన్నారు. పరమశివునికి, జగన్మాత దుర్గాదేవికి, సిద్ధిప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం కూడా అనాదిగా వస్తోందన్నారు. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదులు, క్రతువులు నిర్వహించే వారన్నారు.
 
నేటికీ దేశంలోని వివిధ ప్రాంతంలో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసాన్ని భక్తులు వ్యక్తం చేస్తుంటారన్నారు. అందువల్లే విజయదశమి రోజునే శమీ పూజను కూడా నిర్వహిస్తారని చెప్పారు. సామాన్యులే గాక యోగులు కూడా నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తుంటారన్నారు. ఆలయాల్లో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువులు పెట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. నవరాత్రుల్లో అమ్మవారు అవతరించిన ఒక్కో రోజు ఒక్కో అవతారంగా అలంకరించి ఆ నామంతో భక్తులు ఆరాధిస్తుంటారన్నారు. జగన్మాత అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం జగన్మోహన్ రెడ్డికి అవసరమైన శక్తియుక్తులను ప్రసాదించాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు దసరా నవరాత్రి మహోత్సవాల శుభాకాంక్షలను తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ నుంచి కరోనావైరస్ వెళ్లిపోతున్నట్లే వుంది... కొత్త కేసులు తక్కువే