వయస్సు చిన్నది. ఆలోచనలు పెద్దవి. స్కూలుకు వెళ్ళే వయస్సులో సమస్యలను పరిష్కరించాలన్న తపన. చదువుకున్నది ఎల్‌కేజీనే. కానీ ఆలోచనలు మాత్రం అధికారిలా.. స్కూలుకు వెళ్ళాలంటే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మేము పాఠశాలకు వెళ్ళలేకపోతున్నామంటూ ఎల్‌కేజీ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేసి దిమ్మతిరిగేలా చేశాడు. ఔరా బుడ్డోడా అనే ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది.
నా పేరు కార్తికేయ. నేను ఎల్కేజీ చదువుతున్నాను. ఆదర్స స్కూలులో చదువుతున్నాను. నేను స్కూలుకు వెళుతుంటే వాహనాలు వచ్చేస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీలు ఎక్కువగా వస్తున్నాయి. జెసిబీలు వచ్చి రోడ్లును త్రవ్వేస్తున్నారు. రోడ్డు ట్రాఫిక్ జాం అయిపోతోంది. స్కూలుకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందంటున్నాడు ఐదేళ్ళ కార్తికేయ.
రోజూ పొద్దునే స్కూలుకు వెళ్లే సమయంలో ఇబ్బందికరంగా మారుతోందంటూ సిఐకి ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదును తీసుకోవాలని కోరాడు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసు ఫోన్లో మాట్లాడుతూ నిలబడ్డాడు. ఇలా అయితే ట్రాఫిక్ సమస్య తీరేదెలా సారూ అంటూ ముద్దుముద్దు మాటలతో మాట్లాడాడు కార్తికేయ.
ఇంత చిన్నవయస్సులోనే అంత పెద్ద ఆలోచన వచ్చినందుకు కార్తికేయను అభినందించారు పలమనేరు పోలీసులు. ఈ విషయాన్ని ట్వీట్ కూడా చేశారు పలమనేరు పోలీసులు. తన ఒక్కడికే కాదు తనతో పాటు చదువుకునే అందరికీ ఇలాంటి ఇబ్బంది కలుగుతోందన్నాడు.