కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ తరహాలో కర్ఫ్యూను అమలు చేస్తుంది. దీంతో రోడ్లపై పనీబాటలేకుండా తిరిగే వారికి పోలీసులు ఝులక్ ఇస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు.
చట్టం ముందు అందరూ సమానమేనని చెబుతున్న చిత్తూరు జిల్లా, పలమనేరు సీఐ జయరామయ్య కన్నకొడుక్కే ఫైన్ వేశారు. పలమనేరులో ఆయన విధులు నిర్వహిస్తున్న సమయంలో కానిస్టేబుల్ ఓ యువకుడిని తీసుకువచ్చారు.
అతను బయట తిరుగుతున్నాడని సీఐకి చెప్పారు. తీరా చూస్తే ఆ యువకుడు సీఐ కుమారుడు రాహుల్‌గా గుర్తించారు. కన్నకొడుకు అయినా తప్పు చేస్తే శిక్షించాల్సిందేనంటూ రూ.125 ఫైన్ వేశారు. అంతేకాకుండా మరోసారి బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.