Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మానవాళిని ఏకం చేసే శక్తి కవిత్వానిదే: సరస్వతీ సమ్మాన్ గ్రహీత కె.శివారెడ్డి

మానవాళిని ఏకం చేసే శక్తి కవిత్వానిదే: సరస్వతీ సమ్మాన్ గ్రహీత కె.శివారెడ్డి
, శనివారం, 19 డిశెంబరు 2020 (17:36 IST)
ప్రపంచంలోని మనుషులందరిని ఐక్యం చేసే శక్తి ఒక్క కవిత్వానికే ఉందని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ కేంద్ర కమిటీ సభ్యులు, సరస్వతీ సమ్మాన్ గ్రహీత కె.శివారెడ్డి అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి (సీసీవిఏ) నేతృత్వంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (నెల్లూరు), ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖలు సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న 6వ అంతర్జాతీయ అంతర్జాల బహుభాషా కవి సమ్మేళనం (ఆమరావతి పొయెటిక్ ప్రిజమ్-2020) శనివారం ఘనంగా ప్రారంభమైంది.
 
విజయవాడలోని సిసివిఎ ప్రధాన వేదికగా వెబినార్ విధానంలో కార్యక్రమం జరగగా కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి ఛైర్ పర్సన్ డాక్టర్ యార్లగడ్డ తేజస్విని, కవి సమ్మేళనం కన్వీనర్ డాక్టర్ విజయ భాస్కర్, సీసీవిఏ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, మాలక్ష్మి సంస్ధల సిఇఓ మండవ సందీప్, దీపా బాలసుబ్రమణియన్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శివారెడ్డి మాట్లాడుతూ కవిత్యమొక్కటే దాగని సత్యమన్నారు. కవులు సమాజ మార్గనిర్దేశకులని చెప్పారు. డాక్టర్ యార్లగడ్డ తేజస్విని మాట్లాడుతూ అత్యంత ప్రభావవంతమైన భారతీయ సంస్కృతి, సాంప్రదాయలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో కల్చరల్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు.
 
గుజరాత్ సాహిత్య అకాడమీ చైర్మన్ పద్మశ్రీ విష్ణు పాండ్య మాట్లాడుతూ సాహిత్య రాజధాని అయిన విజయవాడ నగరంలోని ఇలాంటి అంతర్జాతీయ స్థాయిలో కవి సమ్మేళనాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. శాతవాహనుల కాలం నుంచి విజయవాడ సాహిత్య కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ ఎన్.గోపి, పాపినేని శివశంకర్ మాట్లాడుతూ కవితలు తెలుగు వారి ప్రత్యేకత అన్నారు. కల్చరల్ సెంటర్ విభిన్న భాషల మేలు కలయికగా అంతర్జాతీయ స్థాయిలో కవి సమ్మేళనాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. పర్యావరణ హితంగా కవులు చెప్పిన కవితలు చాలా బాగున్నాయన్నారు. తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాతూ సాహితీ రంగానికి కల్చరల్ సెంటర్ చేస్తున్న కృషి అమోఘమైనదని, కవుల సృజనాత్మకతకు ఏ శక్తి అడ్డుకోలేదన్నారు.
 
 ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ డి.మునిరత్నం నాయుడు మాట్లాడుతూ తెలుగు భాష, సాహితీ రంగాల్లో కల్చరల్ సెంటర్ చేస్తున్న కృషికి తమ వంతు సహాయ, సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఈ 6వ అంతర్జాతీయ అంతర్జాల కవి సమ్మేళనంలో 32 దేశాల నుంచి 40 భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 162 మంది కవులు పాల్గొంటున్నారని తెలియజేశారు. మొదటి రోజు 75 మంది కవులు తమ కవితామృతంతో ఓలలాడించగా, అదివారం నాటి కార్యక్రమంలో 85 మంది కవులు పాల్గొంటారని తెలిపారు. దీపా బాలసుబ్రమణియన్ సమన్వయకర్తగా  వ్యవహరించగా, కవి సమ్మేళనంలో భిన్న దేశాల కవులు విభిన్న భాషల్లో వినిపించిన కవితలు ఆకట్టుకున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

viral video- కరోనావైరస్ టీకా తీసుకుంది, కెమెరాల ముందే దబ్బున పడిపోయింది