భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం యూకే వెళ్ళిన 300 మంది విద్యార్థులు కరోన విస్తృతితో తీవ్ర భయాందోళనలో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి శ్రీ ఎస్.జైశంకర్‌కు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి స్పందించారు. పవన్ కళ్యాణ్‌తో ఫోన్లో మాట్లాడారు.
అక్కడ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు తగిన సౌకర్యాలను అందిస్తామని తెలిపారు. విద్యార్థినీవిద్యార్థుల వివరాలను తమకు పంపిచాలనీ, వారి వివరాలు అందిన తర్వాత సత్వరమే సహాయచర్యలకు ఉపక్రమిస్తామని తెలియజేశారు.
కరోనా వైరస్ విజృంభణ నేపధ్యంలో స్వదేశానికి వచ్చేయడానికి ప్రయత్నించిన ఆ విద్యార్థులు యూకే విమానాశ్రయాల్లో, లండన్ లోని హై కమిషన్ ఆఫ్ ఇండియాలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. గత 12 రోజులుగా వారికి సరైన ఆహారం, వసతి లేక ఇబ్బందులుపడుతున్నారు. వీరి సమస్యను పవన్ కళ్యాణ్ కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లారు.