ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారి దర్శన వేళల్లో ఆలయ అధికారులు మార్పులు చేశారు. కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేఫధ్యంలో శుక్రవారం భక్తులకు అమ్మవారి దర్శనం సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ అధికారులు పెంచారు. అదేవిధంగా కరోనా ప్రారంభం నుంచి దుర్గగుడిలో భక్తులు అమ్మవారి సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం నిలిపివేశారు.
అయితే ఇకపై భక్తులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరుగనున్న అమ్మవారి పంచహారతులు సేవలో పరిమిత సంఖ్యలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. అదేవిధంగా అమ్మవారి సేవల టిక్కెట్లను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
www.kanakadurgamma.org, మొబైల్ యాప్ kanakadurgamma, అలాగే మీ సేవా సెంటర్ల ద్వారా భక్తులు అమ్మవారి సేవా టికెట్లు పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
కనకదుర్గకు 36 గ్రాముల బంగారు ఫాన్సీ హారం
తెనాలికి చెందిన దాత పెడిబోయిన ప్రసాద్ శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు 36 గ్రాముల బరువు గల బంగారు ఫాన్సీ హారంను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబుని కలిసి దేవస్థానమునకు సమర్పించారు.
ఆలయ అధికారులు దాత కుటుంబమునకు అమ్మవారి దర్శనము కల్పించి, అమ్మవారి శేషవస్త్రము, చిత్రపటం, మరియు ప్రసాదములు అందజేశారు.