Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూనియర్, యువ రెడ్ క్రాస్ యూనిట్ల స్దాపన అత్యావశ్యకం: బిశ్వ భూషణ్ హరిచందన్

జూనియర్, యువ రెడ్ క్రాస్ యూనిట్ల స్దాపన అత్యావశ్యకం: బిశ్వ భూషణ్ హరిచందన్
, శుక్రవారం, 26 జూన్ 2020 (20:40 IST)
పాఠశాలల్లో జూనియర్ రెడ్‌క్రాస్, యూత్ రెడ్‌క్రాస్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్ధితులలో శిక్షణ పొందిన రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలు అత్యంత కీలకమని గవర్నర్‌ తెలిపారు. 

ఈ క్రమంలో భారత రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ నూతన వాలంటీర్ల నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. విజయవాడ రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలలో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ యూనిట్లను స్థాపించడానికి, రెడ్ క్రాస్ కు సంబంధించిన సమాచారం పాఠ్యాంశాల్లోకి చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్య, ఉన్నత విద్యా శాఖల అధిపతులను గవర్నర్ ఆదేశించారు.

నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన మొబైల్ యాప్ యువ వాలంటీర్లను పెద్ద సంఖ్యలో చేర్చుకోవటానికి, వారితో నిరంతరం అనుసంధానం కలిగి ఉండటానికి సహాయపడుతుందని గవర్నర్ వివరించారు.
 
కరోనా వల్ల మానవాళి అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటుందని, కరోనా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని,  ప్రపంచవ్యాప్తంగా ప్రజల సాధారణ జీవితానికి దూరం అయ్యారన్న బిశ్వ భూషణ్,  సమాజం అదృశ్య శత్రువుపై పోరాడవలసి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసారు. అతిపెద్ద ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిలో మనం ఉన్నామని సమిష్టిగా, సమాజ పరంగా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కరోనా పై పోరులో రెడ్ క్రాస్ ఎపి బ్రాంచ్ ప్రభుత్వ కార్యకలాపాలకు సహాయకారిగా నిలిచిందని,  65 రోజుల లాక్ డౌన్ కాలంలో కరోనాపై పోరులో సుమారు 2000 మంది వాలంటీర్లు పాల్గొన్నారన్నారు. మార్చి 25 నుండి 31 మే వరకు సహాయక శిబిరాలను నిర్వహణ,  ఆహార ప్యాకెట్ల పంపిణీ, శారీరక దూరాన్ని పాటించేలా  ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలతో తమ వాలంటీర్లు ఫ్రంట్‌లైన్ యోధులకు సహాయాన్ని అందించారని గవర్నర్ తెలిపారు.

శారీరక దూరం పాటించటం, ముసుగు ధరించటం, చేతుల పరిశుభ్రత వంటి ఆరోగ్య భద్రతా చర్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గవర్నర్ నొక్కి చెప్పారు. ఇవి మన రోజువారీ కార్యకలాపాల్లో అంతర్భాగంగా మారాయన్నారు.  స్వచ్ఛంద రక్తదానం, చెట్ల పెంపకం వంటి వాటిపై దృష్టి పెట్టాలని గవర్నర్ రెడ్‌క్రాస్ బాధ్యులను ఆదేశించారు.
 
రెడ్ క్రాస్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ ఎ. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ గారి పర్యవేక్షణలో ఎపి రెడ్ క్రాస్ సొసైటీ పెద్ద ఎత్తున విభిన్న సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. రెడ్ క్రాస్ సాధారణ కార్యదర్శి  ఎ. కె. పరీదా రెడ్ క్రాస్ యాప్ ప్రాధాన్యతను తెలియజేశారు. 

కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి, రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఖేష్ కుమార్ మీనా, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె. హేమచంద్ర రెడ్డి, నందమూరి తారక రామారావు వైద్య  విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి. శ్యామ్ ప్రసాద్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎంఎం నాయక్, పాఠశాల విద్య శాఖ కమిషనర్  వాడ్రేవు చిన్న వీరభద్రుడు, ఎపిసిఎఫ్ఎస్ఎస్ సిపిఓ హరీంద్ర కుమార్,  ప్రత్యేక అధికారి  పెట్రీ సెల్వి తదితరులు పాల్గొన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీది దోపిడీ ప్రభుత్వం... అఖిలపక్షం మూకుమ్మడి ఆగ్రహం