Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కులాల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రచారం: వైసీపీపై ప‌వ‌న్‌ ఆగ్రహం

కులాల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రచారం: వైసీపీపై ప‌వ‌న్‌ ఆగ్రహం
, శుక్రవారం, 26 జూన్ 2020 (20:20 IST)
కులాల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రచారం చేస్తున్నారని వైసీపీపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కాపులకు ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
 
"ఆకలేసి ఏడ్చే పిల్లాడికి చేతిలో గోలీ పెట్టి బుజ్జగించాలని చూశాడట వెనకటికి ఒక తెలివిగల ఆసామి. ఆంధ్రప్రదేశ్‌లో కాపు కార్పొరేషన్ కూడా ఆ మాదిరిగా ఏర్పాటు అయ్యిందే. వెనుకబడిన జాతికి రిజర్వేషన్లను పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళన నుంచి కాపుల దృష్టి మరల్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాటి పాలకులు తెలివిగా కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి సమస్య నుంచి కొంతవరకు కాపులను  ఏమార్చారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్.సి.పి. పెద్దలు మరింత తెలివితేటలతో ‘గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం’ అన్నరీతిలో ఏ పథకం కింద లబ్ది చేకూర్చినా అది కాపులను ప్రత్యేకంగా ఉద్దరించడానికేనని గొప్పలు చెబుతున్నారు. నవరత్నాలను కూడా కలిపేసి అంకెలను అమాంతం పెంచేశారు. గత  ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కు ఏటా రూ. 1000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించగా ప్రస్తుత పాలకులు ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారు.

మరి వారు ఇచ్చిందెంత? వీరు ఇచ్చిందెంత?.. అడిగిన వారికి కాకి లెక్కలు చెబుతున్నారు. ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి కాపుల కోసం వివిధ పథకాల ద్వారా గత 13 నెలల కాలంగా 23 లక్షల మంది కాపుల కోసం రూ.4770 కోట్లను ఖర్చు చేశామని చెబుతున్నారు.

ఈ నిధులను రాష్ట్రంలో ప్రజల అందరితోపాటు కలిపి ఇచ్చారా? లేదా కాపులకు మాత్రమే ఇచ్చారా? అనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం లేదు. రిజర్వేషన్ గురించి కాపులు డిమాండ్ చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడగా జనసేన భావిస్తోంది. అసలు కాపు కార్పొరేషన్ కు ఇప్పటి వరకు ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రాన్ని ప్రకటించాలని జనసేన డిమాండ్ చేస్తోంది.

కాపు నేస్తం పథకానికి అర్హులుగా కేవలం 2.35 లక్షలు మందిని మాత్రమే గుర్తించడంలో పలు సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవాలు కాపులతోపాటు ప్రజలు అందరికి తెలియవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం కులాల మధ్య విద్వేషాలు పెరగడానికి ఆస్కారం కల్పిస్తోంది. ఎక్కువ నిధులు ఒకే కులానికి దక్కుతున్నాయని చెప్పడం శ్రేయస్కరం కాదు.

అందువల్ల కాపులకు ప్రత్యేకంగా ఇస్తున్న నిధుల వివరాలను సమగ్రంగా ప్రజలకు చెప్పాలని, ఒక్క కాపు కార్పొరేషన్ మాత్రమే కాక వివిధ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లకు కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన నిధుల వివరాలపై శ్వేత పత్రం ప్రకటించాలని కోరుతున్నాము.

కాపుల రిజర్వేషన్ నేపథ్యంలో పుట్టినదే కాపు కార్పొరేషన్.అటువంటి కాపు రిజర్వేషన్ గురించి వై.ఎస్.ఆర్.సి.పి.లోని కాపు ప్రజాప్రతినిధులు  పూర్తిగా మరిచిపోయారు" అని దుయ్యబట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య ముందే ప్రియురాలికి వీడియో కాల్స్, భరించలేని ఆమె...